Let's talk: editor@tmv.in
ప్రజలే దేవుళ్ళు, సభే దేవాలయం - ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ప్రజలే దేవుళ్ళు, సభే దేవాలయం - ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Dantu Vijaya Lakshmi Prasanna
22 జనవరి, 2026

శాసన వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన 86వ ఆఖిల భారత శాసనసభాపతుల సదస్సు ముగింపు రోజైన బుధవారం, "ప్రజల పట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం" అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.

ప్రసంగంలోని ప్రధానాంశాలు:

భారత రాజ్యాంగం "మనం, భారత ప్రజలం" అనే స్ఫూర్తితో రూపొందించబడిందని, ఈ వ్యవస్థలో ప్రజలే అసలైన యజమానులని స్పీకర్ పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు" అనే నినాదాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసనసభలు కేవలం చట్టాలు చేసే భవనాలు కాదని, సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే వేదికలని ఆయన స్పష్టం చేశారు.

శాసనసభల పనితీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, సభా సమయం క్రమంగా తగ్గుతుండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం ఆశించాలంటే, శాసనసభలు ఏడాదికి కనీసం 60 నుండి 75 రోజుల పాటు తప్పనిసరిగా జరగాలని, ఇందుకోసం జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు అవసరమని ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సూచించారు.

డిజిటల్ యుగంలో శాసనసభ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీలో అమలు చేస్తున్న సాంకేతిక సంస్కరణలను వివరిస్తూ, సభా నివేదికలను, చర్చలను సామాన్యులకు అందుబాటులో ఉంచడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.

అలాగే సభలో సభ్యుల ప్రవర్తన ప్రజా నిఘాలో ఉంటుందని, ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే సభ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు పార్లమెంటరీ విలువలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం ఉండాలి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్పీకర్లు దృష్టి సారించాలి అని అన్నారు.

ఈ సదస్సులో మొత్తం మూడు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి. సాంకేతికత ద్వారా శాసన ప్రక్రియలను పౌర-కేంద్రీకృతంగా మార్చడం, ప్రజాప్రతినిధుల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పాలనను బలోపేతం చేయడం, శాసనవ్యవస్థ ప్రజలకు ఎలా జవాబుదారీగా ఉండాలి అనే అంశంపై లోతైన విశ్లేషణ జరిగింది.

ప్రధాన అంశాలుగా డిజిటల్ అసెంబ్లీ, పేపర్‌లెస్ కార్యకలాపాలు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పారదర్శకత, క్రమశిక్షణ, సభా మర్యాదలను కాపాడటం, అంతరాయాలను తగ్గించడం. ప్రజా భాగస్వామ్యం, చట్టాల తయారీలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ఉన్నాయి.

ఈ సదస్సు ముగింపులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, సభాధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పిలుపునిచ్చారు. ఏపీ స్పీకర్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఈ వేదికగా ప్రకటించారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ మూడు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల స్పీకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్పీకర్ చేసిన సూచనలను పలువురు ప్రతినిధులు అభినందించారు. ఈ రోజు ప్రతినిధుల బృందం అయోధ్య రామమందిరాన్ని సందర్శించడంతో ఈ పర్యటన ముగియనుంది.

ప్రజలే దేవుళ్ళు, సభే దేవాలయం - ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు - Tholi Paluku