Let's talk: editor@tmv.in
ప్రజ‌లు విద్యుత్ కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలి: కేంద్రమంత్రి బండి సంజయ్

ప్రజ‌లు విద్యుత్ కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలి: కేంద్రమంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
29 మార్చి, 2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్10 కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును రెడ్‌కో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు విద్యుత్‌ను కొనుగోలు చేసే స్థాయి నుంచి స్వయంగా ఉత్పత్తి చేసి విక్రయించే స్థాయికి ఎదగాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు.

ప్రధానమంత్రి పిలుపు మేరకు తాను కూడా కరీంనగర్‌లోని తన నివాసంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నానని మంత్రి వెల్లడించారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులందరూ, వార్డు సభ్యుల నుంచి కార్పొరేటర్లు, సర్పంచ్‌ల వరకు తమ ఇళ్లపై సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది కేవలం విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడమే కాదు, దేశాన్ని శక్తి పరంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే కీలక అడుగు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లలో సోలార్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా రూ.30,000 నుంచి రూ.78,000 వరకు సబ్సిడీ, 80 శాతం వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలు కూడా సులభంగా సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే వీలుందని మంత్రి వివరించారు. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా నెలవారీ విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, భవిష్యత్తులో ఇది దేశ అభివృద్ధికి కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజ‌లు విద్యుత్ కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలి: కేంద్రమంత్రి బండి సంజయ్ - Tholi Paluku