
ప్రజలు రాహుల్ గాంధీ అబద్ధాల ఫ్యాక్టరీని గుర్తించారు: అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం కుదుర్చుకున్న తాజా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏస్) ఇండో-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భారత రైతులు, మత్స్యకారులు, పశుపాలకుల ప్రయోజనాలను పూర్తిగా రక్షించామని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ నిర్వహించిన భారీ సభలో మాట్లాడిన షా రాహుల్ గాంధీకి ప్రతిరోజూ అబద్ధాలు చెప్పే కొత్త సంప్రదాయం మొదలైంది. అబద్ధం చెప్పడం, దాన్ని గట్టిగా చెప్పడం, మళ్లీ మళ్లీ పునరావృతం చేయడం ఆయన విధానం. కానీ ప్రజలు మీ అబద్ధాల తయారీ ఫ్యాక్టరీని గుర్తించారని విమర్శించారు. దేశంలోని రైతులు, మత్స్యకారులను తప్పుదారి పట్టించి మాయాజాలం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యుకే, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏలు, ఇండో-యుఎస్ ట్రేడ్ డీల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులు, పశుపాలకులు, మత్స్యకారుల ప్రయోజనాలను 100 శాతం రక్షించారని షా పేర్కొన్నారు. ఈ ఒప్పందాల నిబంధనలను పూర్తిగా చదవాలని రాహుల్ గాంధీకి సూచించారు. మత్స్యకారులు ఎఫ్‌టీఏల ద్వారా లాభపడతారని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించిన షా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కుదిరిన పలు అంతర్జాతీయ ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలు ‘అమ్ముడుపోయాయని విమర్శించారు. మన రైతులకు నష్టం వాటిల్లేలా ఒప్పందాలు కుదిరింది మీ ప్రభుత్వ కాలంలోనే. ఇక్కడ మాత్రం మోడీ జీ రైతులు, పశుపాలకుల రక్షణను పూర్తిగా కాపాడారని అన్నారు.
ఇక పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా షా తీవ్ర ఆరోపణలు చేశారు. 2016–21 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వంలో అవినీతి విస్తరించిందని, కాగ్ నివేదిక ప్రకారం రూ.15,000 కోట్ల అభివృద్ధి నిధులు మాయం అయ్యాయని ఆరోపించారు. రూ.15,000 కోట్లు పుదుచ్చేరి మూడు సంవత్సరాల బడ్జెట్‌కు సమానమని పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని తెలిపారు.
త్వరలోనే ప్రధాన మంత్రి మోడీ పుదుచ్చేరి పర్యటనకు రానున్నారని, అభివృద్ధి పథకాలను ప్రారంభించి కొత్త కార్యక్రమాలను ప్రకటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ–బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. 2029లో కూడా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు.
