Let's talk: editor@tmv.in
ప్రజలను రెచ్చగొట్టినందుకే వాంగ్‌చుక్‌ నిర్బంధం: కేంద్రం

ప్రజలను రెచ్చగొట్టినందుకే వాంగ్‌చుక్‌ నిర్బంధం: కేంద్రం

Pinjari Chand
4 ఫిబ్రవరి, 2026

లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో ప్రజలను రెచ్చగొట్టినందుకే వాతావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను నిర్బంధించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ యూనియన్ టెరిటరీ పరిపాలన యంత్రాంగం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ ప్రాంతం పాకిస్తాన్‌, చైనాలకు ఆనుకొని ఉన్న సున్నితమైన భౌగోళిక ప్రాంతమని కేంద్రం పేర్కొంది. వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించిన చర్యను సమర్థిస్తూ, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తులు అరవింద్ కుమార్‌, పీ.బి. వరలే ధర్మాసనానికి వివరణ ఇచ్చారు.ఇది పాకిస్తాన్‌, చైనాలకు సమీపంగా ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యక్తి గురించి ఈ కోర్టు పరిశీలిస్తోందని ఆయన అన్నారు. వాంగ్‌చుక్‌ నిర్బంధంలో అన్ని విధివిధానాలు ఖచ్చితంగా పాటించామని, ఎన్ఎస్ఏలోని అన్ని నిబంధనలను అమలు చేశామని మెహతా స్పష్టం చేశారు. వాంగ్‌చుక్‌కు న్యాయపరమైన సముచిత న్యాయం కల్పించిందని కూడా ఆయన తెలిపారు. ఈ కేసులో వాదనలు పూర్తికాకపోవడంతో, విచారణను బుధవారం కొనసాగించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వాంగ్‌చుక్‌ నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో జరిగిన ఉద్యమాల తరహాలో యువతను (జెన్ జీ) నిరసనలకు ప్రేరేపించేందుకు ప్రయత్నించారని సోమవారం కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాగే అరబ్‌ స్ప్రింగ్‌ తరహా ఉద్యమాలను ఉదహరించారని, వాటి ఫలితంగా పలు దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయని మెహతా గుర్తు చేశారు.

వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి జే. ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. వాంగ్‌చుక్‌ను ఎన్ఎస్ఏ కింద నిర్బంధించడం చట్టవిరుద్ధమని, ఇది మౌలిక హక్కుల ఉల్లంఘన అని ఆమె వాదించారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం, భారత రక్షణకు హానికరంగా వ్యవహరించే అవకాశం ఉన్న వ్యక్తులను కేంద్రం లేదా రాష్ట్రాలు గరిష్ఠంగా 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. అవసరమైతే ముందే ఆదేశాలను రద్దు చేయవచ్చు. జనవరి 29న జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్‌చుక్‌, ‘అరబ్ స్ప్రింగ్’ తరహాలో ప్రభుత్వం కూలదోసే వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శించడం, నిరసన వ్యక్తం చేయడం తన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. వాంగ్‌చుక్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, పోలీసులు ఎంపిక చేసిన వీడియోలు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు.

గతేడాది సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. అంతకు రెండు రోజుల ముందు లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన హింసాత్మక నిరసనల్లో నలుగురు మృతి చెందగా, 90 మంది గాయపడ్డారు. ఆ హింసకు వాంగ్‌చుక్‌ కారణమని ప్రభుత్వం ఆరోపించింది. అయితే లేహ్‌లో సెప్టెంబర్ 24న జరిగిన హింసాత్మక ఘటనలకు వాంగ్‌చుక్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన భార్య ఆంగ్మో స్పష్టం చేశారు. వాంగ్‌చుక్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా హింసను ఖండించారని, శాంతియుత ఉద్యమమే లద్దాఖ్ లక్ష్యమని చెప్పారని ఆమె తెలిపారు. హింస జరిగిన రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజని వాంగ్‌చుక్ పేర్కొన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రజలను రెచ్చగొట్టినందుకే వాంగ్‌చుక్‌ నిర్బంధం: కేంద్రం - Tholi Paluku