
ప్రజలను మోసం చేయడమే డీఎంకే పని: విజయ్
తమిళ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ మంగళవారం పుదుచ్చేరిలో నిర్వహించిన భారీ సభలో డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో రాష్ట్ర హోదా డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తోందంటూ ఆరోపించారు. డీఎంకేను నమ్మొద్దు. వారి పని ప్రజలను మోసం చేయడమే.
తమిళనాడులో కొందరి మాదిరిగా, పుదుచ్చేరి ప్రజలు మమ్మల్ని తిరస్కరించకండి అని కోరారు. రాష్ట్రం–కేంద్రపాలిత రాష్ట్రం అనే పరిమితులు ఉన్నా, తన ఉద్యమానికి ఈ రెండు ప్రాంతాలు ఒకటేనని స్పష్టం చేశారు. కేంద్రానికి తమిళనాడు ఒక రాష్ట్రం, పుదుచ్చేరి యూనియన్ టెర్రిటరీ, కానీ మా దృష్టిలో మనమంతా సమానమే. పరిపాలనా విభజన ఉన్నా మన ఆత్మ ఒక్కటే. అలాగే భారతీయార్, అరవింద ఆశ్రమం, మాతా ఆశ్రమం వంటి చారిత్రక–సాంస్కృతిక గుర్తులను ప్రస్తావించారు. రాజకీయ పరంగా 1974లోనే పుదుచ్చేరి ప్రభుత్వం ఏర్పడిందని, తమిళనాడులో మాత్రం ఎంజీఆర్ ప్రభుత్వం 1977లో ఏర్పడిందని గుర్తు చేశారు.
ఇది వేరే పార్టీ కార్యక్రమం అయినా భద్రత, క్రమశిక్షణను అద్భుతంగా ప్రదర్శించారు. ఇందుకు సీఎంకి, ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. తమిళనాడు ప్రభుత్వం వీరి వద్ద నుంచి నేర్చుకోవాలని స్టాలిన్ కు చురకలంటించారు. పుదుచ్చేరిలో టీవీకే పార్టీ బలంగా ఎదుగుతుందన్న నమ్మకంతో రాబోయే ఎన్నికల్లో మా జెండా ఎగువన ఎగురుతుందనే విశ్వాసాన్ని విజయ్ ప్రకటించారు.
సభలో కలకలం
సినీనటుడు, తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు విజయ్ ఆధ్వర్యంలో కరూర్ తొక్కిసలాట తర్వాత జరుగుతున్న పార్టీ తొలి బహిరంగ ర్యాలీలో మంగళవారం కలకలం చోటుచేసుకుంది. తుపాకీతో ర్యాలీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పుదుచ్చేరి ఉప్పలంలోని ఎక్స్‌పో గ్రౌండ్ (న్యూ పోర్ట్) వద్ద ఉన్న ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అనుమానం వచ్చి తనిఖీ చేసినప్పుడు ఆ వ్యక్తి నడుము వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్ దాచినట్టు బయటపడింది.
ఎవరికి భద్రత కల్పిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం నిరాకరణ
శివగంగ జిల్లా వాసినని చెప్పుకున్న ఆ వ్యక్తి, తాను ఒక వ్యక్తిగత భద్రతాధికారి అని తెలిపాడు. దీంతో ఎవరికి భద్రత అందించడానికి వచ్చారని పోలీసులు ఆరా తీయగా ఆ విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనితో ఆయనను వెంటనే విచారణ కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కరూర్ తొక్కిసలాట తరువాత మొదటి ర్యాలీ
ఈ ఏడాది సెప్టెంబర్ 27 న కరూర్ ర్యాలీలో 41 మంది మరణించిన తొక్కిసలాట ఘటన తరువాత తమిళనాడు ప్రభుత్వం విజయ్‌కు అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో పుదుచ్చేరి ర్యాలీకి పోలీసులు కఠినమైన నిబంధనలు విధించారు. అందులో 5,000 మందికే ప్రవేశ అనుమతి ఉండాలని, క్యూఆర్ కోడ్ ఉన్నవారికే ఎంట్రీ, పూర్తి స్థాయి సెక్యూరిటీ చెకింగ్ చేయాలని షరతులు పెట్టారు.అయినా విజయ్‌ను చూడాలనే ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు ప్రాంగణం చుట్టుపక్కల గుమిగూడారు. కొందరు చెట్లెక్కి విజయ్‌ను చూసేందుకు ప్రయత్నించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ర్యాలీ దగ్గర పోలీసులతో టీవీకే నేతల వాగ్వాదం
ప్రవేశ నియమాలను సడలించాలని కోరిన కొంతమంది టీవీకే పెద్దలను, అక్కడ విధుల్లో ఉన్న ఒక సీనియర్ మహిళా పోలీసు అధికారి నిరాకరించారు. 41 మంది చనిపోయారు… భద్రతలో రాజీ ఉండదని హెచ్చరించిన ఆమె, మరొకసారి గందరగోళం తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాలీలో భద్రత ఏర్పాటు చేయడానికి 1,500 మంది పోలీసులను మోహరించగా, టీవీకే తరఫున కూడా పసుపు టీ-షర్ట్లు ధరించిన అనేక మంది వాలంటీర్లు ర్యాలీకి వచ్చిన అభిమానులను, కార్యకర్తలను పర్యవేక్షించారు.
