
ప్రజలను దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు: ఖర్గే
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకునేందుకు ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు, ఒక్క ఏడాదిలోనే రెండోసారి రైల్వే టికెట్ ధరలను పెంచడం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం రైలు టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణ తరగతిలో 215 కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల నాన్-ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసాలు, అన్ని రైళ్ల ఏసీ తరగతులకు కూడా కిలోమీటరుకు 2 పైసాలు పెంచినట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎక్స్ లో పోస్ట్ చేసిన ఖర్గే, మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వేలు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి బలయ్యాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకునేందుకు ఎలాంటి అవకాశాన్నీ వదలడం లేదు. ఒక్క ఏడాదిలోనే రెండోసారి రైల్వే చార్జీల పెంపు, అది కూడా కేంద్ర బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందే. ప్రత్యేక రైల్వే బడ్జెట్ రద్దుతో బాధ్యత పూర్తిగా మాయమైందని ఖర్గే వ్యాఖ్యానించారు.
రైల్వేలు సురక్షితం కాదు
ప్రచార హడావుడిలో మునిగిపోయిన ప్రభుత్వం వాస్తవిక సేవల్ని విస్మరిస్తోందని ఆయన అన్నారు. రైల్వే భద్రత పూర్తిగా క్షీణించిందని, 2014 నుంచి 2023 మధ్య కాలంలో రైల్వే ప్రమాదాల్లో 2.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఎన్సీఆర్బీ నివేదికను ఉటంకించారు. రైల్వేలు ఇక సురక్షితం కాదని ఆయన విమర్శించారు.
భద్రతా వ్యవస్థ అయిన కవచ్ అమలుపై కూడా ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లుగా హడావుడి తప్ప అమలు చేసిందేమిలేదని, కవచ్ కేవలం 3 శాతం మార్గాల్లో, 1 శాతం లోకోమోటివ్‌లలో మాత్రమే అమలవుతోందని చెప్పారు. రైల్వేల్లో ఉద్యోగ ఖాళీలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 3.16 లక్షల ఖాళీలు ఇంకా భర్తీ కాలేదని, యువతకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ విధానం పెరుగుతోందని ఆరోపించారు. అలాగే శిక్షణ, హెచ్‌ఆర్‌డీ నిధుల వినియోగం కూడా దారుణంగా ఉందని, 2023–24లో కేవలం 42 శాతం మాత్రమే వినియోగించగా, 2024–25లో డిసెంబర్ వరకు 68 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు.
లోకో పైలట్లకు కనీస విశ్రాంతి కూడా ఇవ్వడం లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను ఉటంకిస్తూ ఖర్గే అన్నారు. అమృత్ భారత్ పథకంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. 453 స్టేషన్లు అభివృద్ధి చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క స్టేషన్ మాత్రమే అప్‌గ్రేడ్ చేయడం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేయడమే అని వ్యాఖ్యానించారు.
వందేభారత్ రైళ్లు సగటు వేగంతోనే నడుస్తున్నాయి
వందే భారత్ రైళ్ల వేగంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. గంటకు 160 కిలోమీటర్లు వేగం అన్న ప్రచారం ఉన్నప్పటికీ, వాస్తవంగా అవి కేవలం 76 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుస్తున్నాయని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు రాయితీలు రద్దు చేసి రూ.8,913 కోట్లను వసూలు చేశారని, మరోవైపు రైల్వేలు రూ.2,604 కోట్ల నష్టాల్లో ఉన్నాయని కాగ్ నివేదికను ప్రస్తావించారు.
మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వేలు నిర్లక్ష్యం, ఉదాసీనత, తప్పుడు ప్రచారాల కథగా మారాయని ఆరోపించారు. పెరిగిన టికెట్ ధరలు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే సబర్బన్ రైళ్ల నెలవారీ సీజన్ టికెట్లకు, అలాగే 215 కిలోమీటర్ల వరకు సాధారణ తరగతి ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ధరల పెంపుతో 2026 మార్చి 31 వరకు రైల్వేలకు సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. జూలై 2025లో చేసిన గత ధరల పెంపుతో ఇప్పటికే రూ.700 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
