
ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలి: సీఎం స్టాలిన్
నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, అదే సమయంలో ప్రజల పట్ల మానవీయత, వారిపై దయ కలిగి ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, ప్రజల సేవలో నిబద్ధత, నిజాయితీ, బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. శనివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టపడి పోలీసు శాఖలోకి వచ్చిన సిబ్బందిపై సామాజిక బాధ్యత మరింత పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ప్రజలు రాత్రి ఆలస్యంగా, ఉదయాన్నే స్వేచ్ఛగా తిరగడానికి కారణం పోలీసులపై ఉన్న నమ్మకమే కారణమని చెప్పారు.
దేశవ్యాప్తంగా తమిళనాడు సురక్షిత రాష్ట్రంగా, శాంతి ద్వీపంగా గుర్తింపు పొందిందని, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు ఈ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయని సీఎం తెలిపారు. ఈ విశ్వాసాన్ని పోలీసులు కాపాడాలని ఆయన సూచించారు. ఒకే ఒక్క పోలీసు అధికారి చేసే తప్పిదం మొత్తం శాఖపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించాలని కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై జీరో టాలరెన్స్ పాటించాలని సీఎం స్పష్టం చేశారు. మనందరికీ పిల్లలు ఉన్నారు. డ్రగ్స్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే రేపు అది మన పిల్లలకే ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు.
ప్రతి పోలీసు అధికారి ఒక వ్యక్తిగత సంకల్పం తీసుకోవాలని సూచించారు. నా పరిధిలో నా నియంత్రణకు మించి ఏ నేరం జరగనివ్వనని, తమిళనాడు భవిష్యత్తు పోలీసుల చేతుల్లోనే ఉందని, అధికారాన్ని ఎప్పుడూ సమంజసంగా, ప్రజల మేలు కోసం వినియోగించాలని సీఎం అన్నారు. పోలీసుల మంచి పనులు మొత్తం శాఖకు గర్వకారణమవుతాయని, ఒక్క తప్పిదం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందని చెప్పారు. గత ఏడాది వరదల సమయంలో గాయపడిన వ్యక్తిని రక్షించిన మహిళా పోలీసు ఉదాహరణను గుర్తుచేస్తూ, పోలీసింగ్ అనేది మానవత్వంతో విడదీయరానిదని, దయే నిజమైన ధైర్యానికి పునాది అని సీఎం పేర్కొన్నారు. పోలీసులు ప్రజల మిత్రులు అనే నినాదం వారి ప్రవర్తనలో ప్రతిఫలించాలన్నారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలి. అదే సమయంలో నేరాల నివారణలో కఠినంగా ఉండాలని సూచించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అత్యంత సున్నితంగా, బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరించారు. వారానికి ఒక రోజు సెలవు, బీమా కవరేజ్ రెట్టింపు, పోలీసు సిబ్బంది వారి భార్యాభర్తలకు వైద్య పరీక్షలు, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, నైట్ ప్యాట్రోల్ అలవెన్సులు, మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ, మెరుగైన నివాస సదుపాయాలు, భారీగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చామని, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. మీరు పండుగలు, వారాంతాలు కూడా చూసుకోకుండా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నందువల్లే రాష్ట్రంలో ప్రతి పౌరుడు నిర్భయంగా జీవించగలుగుతున్నాడని సీఎం అన్నారు. ఖాకీ యూనిఫాం గౌరవం, బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకొని ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచించారు. శాంతి భద్రతలను రాజీ లేకుండా కాపాడాలని కోరారు. చివరగా పోలీసు సిబ్బందికి వ్యక్తిగత సలహా ఇస్తూ, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఏదైనా క్రీడలో పాల్గొనాలని సీఎం స్టాలిన్ సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు హామీ పెన్షన్ పథకం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం తమిళనాడు హామీ పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తమ చివరి ప్రాథమిక వేతనంలో 50 శాతం పెన్షన్‌గా పొందేలా హామీ ఇచ్చింది. ఇది ఉద్యోగ సంఘాలు దాదాపు 20 ఏళ్లుగా కోరుతున్న ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి 10 శాతం పెన్షన్ నిధికి విరాళంగా చెల్లించాలి. పెన్షన్ చెల్లింపుల కోసం అవసరమైన మొత్తంలో ఏదైనా లోటు ఏర్పడితే, ఆ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
పథకంలోని ముఖ్య ప్రయోజనాలు
• పదవీ విరమణ అనంతరం చివరి ప్రాథమిక వేతనం 50శాతం పెన్షన్
• పెన్షన్‌పై డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు వర్తింపు
• ఉద్యోగి మరణించిన పక్షంలో కుటుంబానికి 60శాతం కుటుంబ పెన్షన్
• గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు గ్రాట్యుటీ
• భవిష్యత్ లో ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వ హామీ
ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ పథకం ప్రకటించిన నేపథ్యంలో ముందుగా ప్రకటించిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ఉద్యోగ సంఘాలు ఉపసంహరించుకున్నాయి. అయితే ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని కొంతమంది విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ దశలోనే ప్రభుత్వంపై సుమారు రూ.13,000 కోట్ల అదనపు భారం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం సుమారు రూ.11,000 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని సీఎం స్టాలిన్ పేర్కొంటూ, ఈ పథకం ఉద్యోగులకు భద్రమైన, గౌరవప్రదమైన పదవీ విరమణ జీవితాన్ని అందిస్తుందన్నారు.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో పోర్టల్–2026 ప్రారంభం
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎంకే పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం.కె. స్టాలిన్ శనివారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో పోర్టల్–2026ను అధికారికంగా ప్రారంభించారు.ఈ పోర్టల్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో కోసం తమ ఆలోచనలు, సూచనలు పంపించవచ్చు. కలైంగర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టో ముసాయిదా కమిటీకి సంబంధించిన అధికారిక ఈమెయిల్ ఐడీ, వాట్సాప్ నంబర్, సోషల్ మీడియా ఖాతాలను సీఎం స్టాలిన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తిదారులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు, ఆశలు తెలియజేయవచ్చని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను మేనిఫెస్టో రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది ప్రజల మేనిఫెస్టో కావాలి: కనిమొళి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడుతూ ఈ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోగా ఉండాలనేదే మా నాయకుడి ఆశ. అందుకోసం సురేష్ సాంబందం ఈ పోర్టల్‌ను రూపొందించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలు ఎప్పుడూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే దృష్టి సారిస్తాయని ఆమె పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా ఏ వర్గానికి చెందినవారైనా తమ అభిప్రాయాలను మాట్లాడి, టైప్ చేసి లేదా అప్‌లోడ్ చేయగలరని చెప్పారు. ఏఐ (కృత్రిమ మేధస్సు) సహాయంతో ఈ పోర్టల్ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా మాకు సూచనలు వస్తాయని కనిమొళి తెలిపారు.
