Let's talk: editor@tmv.in
ప్రజలకు సుపరిపాలన అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రజలకు సుపరిపాలన అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఏపీ సీఎం చంద్రబాబు

Shaik Mohammad Shaffee
7 నవంబర్, 2025

రాష్ట్ర పరిపాలనను పూర్తిగా డేటా ఆధారంగా మార్చి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం జరిగిన డేటా ఆధారిత పాలనపై రాష్ట్ర స్థాయి సదస్సుకు అధ్యక్షత వహించిన సీఎం, “ఇది రియల్ టైమ్ గవర్నెన్స్ యుగం. నిర్ణయాలు వేగంగా, ఆధారాలతో తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. సదస్సుకు మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రజల సమాచారమంతా ఒకే డేటా లేక్‌లో సమీకరించబడుతోంది. అంగన్‌వాడీ స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ప్లాట్‌ఫాం ద్వారా విస్తృతమైన సమాచారాన్ని సమన్వయం చేసి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి” అని అన్నారు. రియల్ టైమ్‌లో అనలిటిక్స్ చేయడం ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతోందని, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా భవిష్యత్‌ పరిస్థితులను అంచనా వేసి చర్యలు చేపట్టడం సాధ్యమవుతోందని వివరించారు.

“ప్రజల సంక్షేమం కోసం భారీస్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నాం. ఆ నిధులు సమర్ధంగా వినియోగించబడాలి. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు కూడా దాని వివరాలు తెలిసేలా చెప్పాలి,” అని సీఎం అన్నారు. ఇ-ఫైల్స్ అందుబాటులో ఉండటం వల్ల ఇప్పుడు నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశముందని ఆయన గుర్తు చేశారు.

గతంలో చిన్న ధృవపత్రం కోసం కూడా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు డిజి లాకర్ వంటి డిజిటల్ పద్ధతులను సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఒకే వేదికపై సమాచారాన్ని పంచుకుని పని చేయాలని ఆయన ఆదేశించారు.

ఇటీవల తుఫాన్ సమయంలో రాష్ట్రం టెక్నాలజీని సమర్ధంగా వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని చెప్పారు. “రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రజలను అప్రమత్తం చేయగలిగాం. ఇది డేటా ఆధారిత పాలన శక్తి” అని సీఎం అన్నారు.

“2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం అధికారులు నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలు సాధించాలి. ప్రతి నియోజకవర్గంలో సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు. జనవరి నుండి క్వాంటం కంప్యూటర్ వ్యవస్థను అమరావతిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా వనరుల వినియోగం సమర్ధవంతంగా సాగుతోందని చెప్పారు.

ప్రభుత్వ సేవలన్నీ 100 శాతం ఆన్‌లైన్‌గా అందించాలనే లక్ష్యాన్ని సీఎం స్పష్టం చేశారు. “ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు వాట్సాప్ గవర్నెనెన్స్ ద్వారా అందాలి” అని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగరాదని, అధికారులు క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.

“రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉందని ప్రపంచం గుర్తిస్తోంది. అందుకే గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది,” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.“మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులు వేయాలి. అప్పుడే విజన్ లక్ష్యసాధన సాధ్యమవుతుంది” అని చెప్పారు.

ముఖ్యమంత్రి చివరగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనితీరును అంచనా వేసి ప్రజాసేవల రేటింగ్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పారు. “ప్రజా సంతృప్తే ప్రభుత్వ విజయానికి ప్రమాణం. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమర్ధ పాలన అందించాలి” అని పిలుపునిచ్చారు.