
ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
పట్టణ ప్రజలకు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సేవలు అందించాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్ బంక్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్ బాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి ముందు మంత్రి పెట్రోల్ బంక్‌ను పరిశీలించి, నిర్వహణ విధానం, సౌకర్యాలు, సేవల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన ఇంధన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, మున్సిపాలిటీలకు స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఆదాయాన్ని పెంచే వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
బీపీసీఎల్ పెట్రోల్ బంక్ కార్యకలాపాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందడంతో పాటు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
