
ప్రజలకు అండగా నిలవండి
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రాంతాల్లో జనావాసాలు అతలాకుతలం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇదే సందర్భంలో వరదల దాటికి ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధిత ప్రజలకు అండగా నిలవాలని, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని తెలంగాణలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సాధారణ ప్రజల జీవనం స్తంభించిపోయిందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందించడం అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన కార్యకర్తలు తక్షణమే రంగంలోకి దిగి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని దిశానిర్దేశం చేశారు పవన్. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వారికి ధైర్యాన్ని చెప్పాలని సూచించారు.
అదే సమయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సరియైన చర్యలు తీసుకుంటూ, సహాయక కార్యక్రమాలను వేగవంతం చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు ఇప్పటికే సహాయం అవసరం అయిన వారిని, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఆహారం అందచేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ , ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషికి తమ సహాయక చర్యలు ఆటంకం కలిగించకుండా, ప్రజలకు తమ వంతు సాయాన్ని అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జనసేన సైనికులను కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
