
ప్రజలందరికీ ఆహారభద్రత అమలయ్యేదెప్పుడు?
ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం, మనం ఎంతో అభివృద్ధి చెందామనకుంటాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలతో మన జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, అద్భుతాలు జరుగుతున్నాయని భావిస్తాం. కానీ అభివృద్ధి, ఆవిష్కరణలు, అత్యాధునిక జ్ఞానం ఇవేవీ భూమ్మీద మనుషులందరికీ సరిపడా ఆహారం అందించలేకపోతున్నాయి. మనుషులందరి ఆకలి బాధను సమూలంగా తీసివేయడం సాధ్యంకావడం లేదు. ప్రభుత్వాల చిత్తశుద్ధిలోపమో, మరో కారణమో తెలియదు కానీ ప్రపంచ జనాభాలో 8.2శాతం ఆకలితో బాధపడుతున్నారు. ఐక్యరాజ్యసమితే ఈ వివరాలు వెల్లడించింది. ఆకలి, పోషకాహార లోపం, ఆహారభద్రతపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఏటా ప్రపంచ ఆహారదినోత్సవం జరుపుకుంటారు.
ఆకలి బాధలు ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉన్నాయి. 30కోట్లకు మందికి పైగా ప్రజలకు ఆ ఖండంలో సరైన ఆహారం లభించడం లేదు. ఆఫ్రికా మొత్తం జనాభాలో ఇది 20శాతం కన్నా ఎక్కువ. ప్రపంచ జనాభాలో 28శాతానికి పోషకాహారం దొరకడం లేదు. ఆఫ్రికాతో పోలిస్తే దక్షిణాసియాలో పరిస్థితులు కాస్త మెరుగు. భారత్‌లో ఆకలితో బాధపడేవారి సంఖ్య2022లో 7.9శాతం ఉంటే, 2024లో 6.7శాతానికి తగ్గింది. భారత్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడడానికి కారణం వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, సంక్షేమ పథకాలు. రాజకీయ సంక్షోభాలు, అంతర్గతయుద్ధాలు, దేశపరిస్థితులు, కరువు, పేదరికం ఆఫ్రికాదేశాల్లో ప్రజలను ఆకలికేకలకు గురిచేస్తున్నాయి.
కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడ్డప్పటికీ అసలు ప్రపంచం ఇంత అభివృద్ధి చెందింది చెప్పుకుంటున్న తరుణంలోనూ ప్రజలు ఇంకా ఆకలితో బాధపడాల్సిరావడం సరైనది కాదు. అతివృష్టి, అనావృష్టి, కరువు, వనరులు లేకపోవడం వంటి కారణాలతో ఉత్పత్తి సరిగా లేక ప్రజల అవసరాలకు సరిపడా ఆహారపదార్థాలు అందుబాటులో లేకపోవడం కొన్నిచోట్ల జరుగుతుంటుంది. అయితే ఎక్కువగా రాజకీయ కారణాలే ప్రజలు ఆకలితో మాడిపోవడానికి కారణమవుతున్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా ఉంటున్నాయి. నిన్నటిదాకా యుద్ధం జరిగిన గాజా పరిస్థితీ అంతే. ఈ ప్రత్యేక పరిస్థితులు కాకుండా చాలా దేశాల్లో ప్రజల ఆకలికి కారణం ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడమే. దేశప్రజలందరి కనీస అవసరాలు తీర్చాలన్న బలమైన ఆకాంక్ష రాజకీయ నేతలకు లేకపోవడమే.
ఆహారం అనేది ప్రజల కనీస అవసరం. ప్రభుత్వాలు ఆ కనీస అవసరం కూడా తీర్చకపోతే, తీర్చడానికి ప్రయత్నాలు చేయకపోతే ఇంక ఆ ప్రభుత్వ మనుగడతో ఉపయోగమేంటి? ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఇలాంటి పరిస్థితులేర్పడినా అక్కడ ప్రభుత్వం లేనట్టే లెక్క. వాతావరణ పరిస్థితుల ప్రభావం ఆహార ఉత్పత్తిపై ప్రధానంగా ఉంటుంది. తగినంత ఆహార ఉత్పత్తి లేకపోవడం పరిస్థితిని దిగజారుస్తుంది. వరదలు, వర్షాభావం, పొడిగాలులు వంటివాటి ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. వాటితో పాటు పాత పద్ధతుల్లో చేసే వ్యవసాయం, నాణ్యత లేని విత్తనాలు, కల్తీ పురుగుమందులు వంటివి ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. పండినపంటను సరిగ్గా నిల్వ చేసే సదుపాయం, అమ్ముకునే ప్రాంతానికి చేర్చే రవాణా సౌకర్యం లేకపోవడం ఆహార సరఫరాకు ఆటంకాలుగా మారుతున్నాయి. పంట చేతికి వచ్చాక సరైన సమయానికి మార్కెట్ చేరకపోతే అవి వృథా అయిపోతాయి. సరిపడా ఆహారపదార్థాలు మార్కెట్‌లో అందుబాటులో లేకపోతే వాటి ధర పెరిగిపోతుంది. డబ్బున్నవారు మాత్రమే వాటిని కొనగలరు. అంత మొత్తాన్ని పేదలు వెచ్చించలేరు. ఇది పోషకాహారలేమికి దారితీస్తుంది. పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, కృత్రిమ కొరత సృష్టించేవారిని అడ్డుకోలేకపోవడం వంటి ప్రభుత్వాల వైఫల్యాలకు పేదలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఉత్పత్తి అయిన ఆహారంలో 30 నుంచి 40శాతం వరకు వ్యర్థమవుతుందని ఓ అంచనా. ఇలా వ్యర్థం కాకుండా అరికట్టగలిగితే అవసరమైనవారికి ఆ ఆహారం చేరుతుంది.
ఆహారధాన్యాలను గిడ్డంగుల్లో నిల్వఉంచడానికి కారణం ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే. కానీ ప్రభుత్వ గిడ్డంగుల్లో సౌకర్యాలలేమితో ఆహారభద్రత నెరవేరడం లేదు. బియ్యం, గోధుమలు, పప్పులు వంటివాటి నిల్వలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అవి నాణ్యత కోల్పోతున్నాయి. చాలా సందర్భాల్లో పనికి రాకుండా పోతున్నాయి. అధునాతన గిడ్డంగుల వ్యవస్థను ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంట కొని నిల్వ చేసి ఆహార భద్రత కల్పిస్తే ఆకలి కేకలు లేని సమాజాన్ని సృష్టించవచ్చు.
భారత్ విషయానికొస్తే ఆహారభద్రతను 1960కి ముందు, తర్వాతగా పోల్చిచూడాలి. నార్మన్ బోర్లాగ్ స్ఫూర్తితో భారత్‌లో ఎం.ఎస్. స్వామినాథన్ ప్రవేశపెట్టిన హరిత విప్లవం వ్యవసాయ స్థితిగతులను కాకుండే దేశ ఆర్థిక పరిస్థితినే మార్చివేసింది. అధిక దిగుబడులనిచ్చే గోధుమ, వరి రకాల ప్రవేశం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం, బోర్లు, ఇరిగేషన్ వ్యవస్థలతో పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతో ఆహార దిగుమతులు తగ్గి ఆహార పదార్థాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 1970లనాటికి ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు బాగా లాభపడ్డాయి.
అయితే హరితవిప్లవంతో కొన్ని ప్రతికూల ప్రభావాలూ కనిపించాయి. భూసారం తగ్గిపోవడం, నీటివనరుల దుర్వినియోగం, చిన్న, కౌలురైతులకు అనుకూలం కాని పరిస్థితులు ఏర్పడడం, కొన్ని ఆహార ధాన్యాల అవసరానికి మించి ఉత్పత్తితో విభిన్న రకాల పంటలు పండించే సంస్కృతి దెబ్బతినడం వంటి ప్రతికూలతలు హరిత విప్లవం వల్ల ఏర్పడ్డాయి. అయినప్పటికీ హరిత విప్లవాన్ని దేశప్రజల ఆకలి తీర్చిన సానుకూల పరిణామంగానే ఎక్కువమంది భావిస్తారు.
అయితే హరిత విప్లవంతో దేశంలో ఆహార సమస్యకు, ఆకలి చావులకు తెరపడలేదు. హరిత విప్లవం అమలు చేసిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేకమంది ప్రజలు పేదరికంతో, ఆకలితో, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆహార సమస్యను సమూలంగా తొలగించడంపై దృష్టిపెట్టడం లేదు. రైతులు ఉత్పత్తి చేసినవి వినియోగదారునికి చేరే క్రమంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు చేయాలనుకుంటే కచ్చితంగా దేశప్రజలందరికీ ఆహార భద్రతను అమలు చేయగలవు. నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టడం, పంట మార్పిడి పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచడం, పంటలకు గిట్టుబాటుధర కల్పించడం, పంట సరైన సమయానికి మార్కెట్‌కు చేరేలా రవాణా సదుపాయాలు పెంచడం, పంట కొనుగోళ్లు, అమ్మకాల్లో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం, దేశ అవసరాలకు తగినట్టుగా ఎగుమతులు, దిగుమతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే..ప్రజలందరికీ పోషకాహారం అందడం కష్టసాధ్యమైన విషయమేం కాదు.
