Let's talk: editor@tmv.in
ప్రకృతి వ్యవసాయం వైపు భారత్: ఆశయాలు, ఆవశ్యకతలు, అడ్డంకులు, భవిష్యత్తు అడుగులు

ప్రకృతి వ్యవసాయం వైపు భారత్: ఆశయాలు, ఆవశ్యకతలు, అడ్డంకులు, భవిష్యత్తు అడుగులు

Dr.Chokka Lingam
21 నవంబర్, 2025

భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా నూతన చర్చకు నాంది పలికింది. జాతీయ వ్యవసాయ సదస్సులో మాట్లాడిన ఆయన, గత దశాబ్దంలో భారత వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, ఇక ప్రకృతి వ్యవసాయం వ్యవసాయరంగం యొక్క తదుపరి అధ్యాయమని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే కాదు; మారుతున్న పర్యావరణ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలక సమస్యలకు సమాధానాన్ని వెతుకుతున్న సందర్భంలో వచ్చిన వ్యాఖ్య.

భారతదేశంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాష్ట్రాలవారీగా దీని ప్రోత్సాహం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్ష హెక్టార్ల భూమి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిందని అంచనా, అలాగే 16–17 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గుజరాత్ 3.17 లక్ష హెక్టార్లతో ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 2.9 లక్ష హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 1.11 లక్ష హెక్టార్లు ప్రకృతి వ్యవసాయ పరిధిలో ఉన్నాయి. హిమాచల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో చిన్న స్థాయి విస్తరణ కొనసాగుతోంది. పంటల విషయానికి వస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, వేరు శనగ మొదలైన పంటలు, ఇంకా మిక్స్ క్రాపింగ్ పద్ధతుల్లో పండే పంటలు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు . అయితే సౌకర్యాలు, సర్టిఫికేషన్, మార్కెట్ లింకేజీలు, మొదటి సంవత్సరాల్లో తగ్గే దిగుబడి వంటి సమస్యల వల్ల విస్తరణ ఆలస్యంగా జరుగుతోంది. అయినప్పటికీ, భూసార క్షీణత మరియు రసాయన ఆధారతపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా ప్రకృతి వ్యవసాయం దేశవ్యాప్తంగా నెమ్మదిగా కానీ స్థిరంగా విస్తరిస్తూ, భవిష్యత్తు వ్యవసాయ దిశగా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా గుర్తింపు పొందుతోంది.

ఈ నేపథ్యంలో ‘ప్రకృతి వ్యవసాయం’ అనే పదం తిరిగి ప్రజా చర్చలోకి రావడం యాదృచ్ఛికం కాదు. రసాయనాలపై ఆధారపడి సాగుతున్న వ్యవసాయ వ్యవస్థ ప్రస్తుతం ఒక కీలక మలుపులో నిలిచి ఉంది. భూసార క్షీణత, భూగర్భజలాల నాశనం, పంటల జీవ వైవిధ్యం కోల్పోవడం ఈ సమస్యలు ఒక రైతు వ్యక్తిగత సమస్యలు మాత్రమే కాక, దేశంలోని ఆహార భద్రతను ప్రభావితం చేసే జాతీయ సమస్యలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది.

సాంప్రదాయాల నుంచి సుస్థిరత వైపు - వ్యవసాయ భావజాలం పరిణామం

ప్రకృతి వ్యవసాయం భారతదేశంలో కొత్త అంశం కాదు. వేల ఏళ్లుగా ఇటువంటి పద్ధతులుతోనే పంటలు పండించారు. గోవు ఆధారిత వ్యవసాయం, జీవామృతం, మల్చింగ్, మిశ్రమ పంటలు వంటి పద్ధతులు భారత గ్రామీణ జీవనంలో అంతర్భాగాలు. అయితే ఆధునిక కాలంలో రసాయన విప్లవం ఈ పద్ధతులను వెనక్కుకు నెట్టింది. ఎక్కువ దిగుబడి కోసం రైతులు రసాయనాలపై భారీగా ఆధారపడగా, దాని ఫలితంగా మట్టిలోని జీవక్రియలు దెబ్బతిన్నాయి. ఇప్పుడీ పద్ధతులను ప్రభుత్వ సహాయంతో తిరిగి ప్రవేశపెట్టడం అంటే కేవలం వ్యవసాయ మార్పు కాదు; అది రైతు జీవన శైలిలో మార్పు. అందుకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ZBNF, కేంద్రంలో PKVY కింద భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి, పలు రాష్ట్రాల స్థానిక ప్రయోగాలు ఇవన్నీ ఒక విస్తృత సంస్కరణ దిశగా అడుగులు.

ఈ కార్యక్రమాలు సూచిస్తున్న సందేశం స్పష్టంగా ఉంది వ్యవసాయం భారీ ఖర్చులకు కాదు, ప్రకృతి చక్రాలకు అనుగుణంగా సాగాలి.

రైతుపరంగా వాస్తవాలు ఆకర్షణ, అనిశ్చితి, ఆర్థిక ప్రమాదం

అయితే ప్రకృతి వ్యవసాయం రైతుకు ఒకవైపు ఆశ, మరోవైపు భయం. ప్రస్తుత వ్యవసాయ ఖర్చుల్లో 40–60% వరకూ రసాయనాలు, ఎరువులవే . ఈ భారాన్ని తొలగించే మార్గం ప్రకృతి వ్యవసాయం. కానీ మరోవైపు ఈ పద్ధతుల అమలుకు అవగాహన, శిక్షణ, సమయపాలన అన్నీ అవసరము

ముఖ్యంగా ప్రారంభ సంవత్సరాల్లో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఇది పెద్ద రైతులు భరించగలిగినా, పేద రైతులకు ఇది భారం. వారు రోజువారీ ఆదాయంపై ఆధారపడే వారు; రెండు పంటలు దిగుబడి తగ్గిపోతే వారి కుటుంబం ఆర్థికంగా కుదేలవుతుంది. అంతే కాకుండా మార్కెట్ స్థిరంగా ఉండదు. ప్రకృతి పద్ధతుల్లో పండించిన ధాన్యం మార్కెట్లో ప్రత్యేకంగా గుర్తించబడకపోతే రైతుకు అదనపు లాభం రాదు. ‘ఆర్గానిక్’ అని చెప్పగానే వినియోగదారులకు ధరలు పెరిగినట్లు అనిపిస్తుంది, కానీ రైతు ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువ.రైతు కోసం అత్యంత కీలకమైన అంశం ‘నిర్ధారిత కొనుగోలు’. ప్రభుత్వంవద్ద MSP హామీ లేకపోతే కొత్త పద్ధతి ప్రయోగించడం రైతు భవిష్యత్తుకే ప్రమాదం.

భారత్‌ భూభాగ వైవిధ్యం ఒకే మోడల్‌తో వ్యవసాయ మార్పు అసాధ్యం

భారత్ ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన భూభాగాలను కలిగిన దేశం. ఉత్తరంలోని హిమాలయాల నుంచి దక్షిణంలోని అధిక తేమ వాతావరణం ఉన్న తీరప్రాంతాల వరకు, పశ్చిమంలోని ఎడారి భూముల నుంచి తూర్పున భారీవర్షాలు పడే ప్రాంతాల వరకు ప్రతి ప్రాంతం వేరు.ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఒకే విధానంతో అమలు చేయడం అసాధ్యం.

ఆంధ్రప్రదేశ్‌లో పని చేసిన పద్ధతి రాజస్థాన్‌లో పనిచేయకపోవచ్చు. కేరళలోని పుష్కల వర్షం ఉండే ప్రాంతాల్లో పనిచేసేదీ, మహారాష్ట్రలోని కరువు జిల్లాల్లో పనిచేయకపోవచ్చు. అందువల్ల ‘ఒకే పరిష్కారం’ అనే మోడల్‌ వ్యవసాయానికి అన్వయించదు.ప్రాంతానికొక పరిశోధన, పంటకు తగిన బయోలాజికల్ పద్ధతులు, స్థానిక రైతుల అనుభవాలపై ఆధారపడిన మార్గదర్శకాలు ఇవన్నీ అవసరం.

మార్కెట్, సర్టిఫికేషన్, విలువచేర్పు సవాళ్లు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సిద్దాంతపరంగా మార్కెట్లో అధిక విలువ పొందాలి. కానీ వాస్తవం పూర్తిగా భిన్నం. రసాయన రహిత ఉత్పత్తులను గుర్తించడానికి విశ్వసనీయ సర్టిఫికేషన్ లేదు. మార్కెట్ అసంఘటితంగా ఉంది. మధ్యవర్తులు వ్యవసాయ ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ ఎక్కువ లాభం పొందుతారు, రైతు మాత్రం తక్కువ ఆదాయం పొందుతాడు. ప్రకృతి వ్యవసాయం విజయవంతం కావాలంటే నమ్మదగిన సర్టిఫికేషన్‌ వ్యవస్థ, సరఫరా గొలుసులో పారదర్శకత, కొనుగోలు దారు ప్రోత్సాహం తప్పదు . పక్షంలో ప్రకృతి వ్యవసాయం ధనిక రైతులకు మాత్రమే లాభం చేకూర్చే అవకాశం ఉంది.

గ్రీన్ రివల్యూషన్ - లాభాలు, కానీ దీర్ఘకాల నష్టాలు

1960లలో గ్రీన్ రివల్యూషన్ భారతదేశాన్ని ఆకలికాటునుంచి రక్షించింది. ఎక్కువ దిగుబడులిచ్చే విత్తనాలు, భారీ రసాయన ఎరువులు, క్రమబద్ధమైన పంటపద్ధతులు ఇవన్నీ ఆహారోత్పత్తిని విపరీతంగా పెంచాయి. కానీ గత 50 ఏళ్లలో వచ్చిన దుష్ప్రభావాలు చాలా తీవ్రం- మట్టిలో సూక్ష్మ జీవక్రియలు దెబ్బతిన్నాయి. నీటి మట్టం పడిపోయింది. ఒకే పంటపద్ధతులు జీవ వైవిధ్యాన్ని నాశనం చేశాయి. రైతులు అప్పుల బారిన పడ్డారు. ఈ వాస్తవాలన్నింటినీ దృష్టిలో పెడితే ప్రకృతి వ్యవసాయం ఒక ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే కాదు; అనివార్యమైన మార్గమని అంగీకరించక తప్పదు

శాస్త్రీయ పరిశోధనలు అవసరం

ప్రకృతి వ్యవసాయం విజయవంతం కావాలంటే శాస్త్రీయ ఆధారాలు తప్పనిసరి. అనుభవ కథలు సరిపోవు. అనేక సీజన్లలో పంట పరిశోధనలు, మట్టిసార విశ్లేషణలు, విత్తన ప్రయోగాలు ఇవన్నీ అవసరం.వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICAR వంటి సంస్థలు ఈ మార్పులో ప్రధాన పాత్ర పోషించాలి. ఇవి పక్కన నిలబడి సలహాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాకుండా, రైతుతో భూమిపై పని చేసే భాగస్వాములు కావాలి.ప్రకృతి వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీలు, పంటబీమా, ప్రత్యేక మద్ధతు ధర లాంటి హామీలు, మొదటి సీజన్లలో దిగుబడి తగ్గినా ఆర్థిక రక్షణ వంటివి ప్రభుత్వం అందించాలి

భవిష్యత్తు దిశ ఆదర్శం, శాస్త్రీయత, రైతు కేంద్రత

మోదీ విజన్ ఒక దిశను చూపించింది. కానీ ఆ దిశలో వెళ్ళాలంటే నినాదాలు కాదు, సుస్థిర ప్రణాళిక అవసరం.ఆదర్శం ఉండాలి, కానీ అమలు శాస్త్రీయంగా ఉండాలి. పథకం ఉండాలి, కానీ రైతు కేంద్రంగా ఉండాలి. సుస్థిరత కావాలి, కానీ రైతు జీవనోపాధి దెబ్బతినకూడదు.భారత్‌ ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచ కేంద్రంగా మారడానికి సామర్థ్యం ఉన్న దేశం. కాని ఈ ప్రయాణం ప్రకటనలతో కాదు మెల్లగా, సుస్థిరంగా, శాస్త్రీయంగా, రైతు చేతుల్లో జరిగే మార్పుతోనే విజయవంతమవుతుంది.ఈ మార్పు భారత వ్యవసాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాయొచ్చు అదే ప్రకృతి ఆధారిత వ్యవసాయం, రైతు ఆధారిత విధానం, భవిష్యత్తు ఆధారిత దృష్టికోణం.