Let's talk: editor@tmv.in
ప్రకృతి విపత్తుల సుడిగుండంలో ఫిలిప్పీన్స్

ప్రకృతి విపత్తుల సుడిగుండంలో ఫిలిప్పీన్స్

Shaik Mohammad Shaffee
6 నవంబర్, 2025

వరుస ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్ దేశం అల్లాడిపోతోంది. గత నెలలో సంభవించిన ఘోర భూకంపం నుంచి కోలుకోకముందే ఇప్పుడు కల్మాగి తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాలు, వరదలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఫలితంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ విపత్తులో ముఖ్యంగా సెబు ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది.

ఈ విపత్తు కారణంగా కనీసం 66 మంది మరణించినట్లు, 26 మంది గల్లంతైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల అనేక ఇళ్లు మునిగిపోయాయి, వందలాది కార్లు కొట్టుకుపోయాయి. మంగళవారం, అగుసన్ డెల్ సుర్ ప్రావిన్స్‌లో సహాయక చర్యలకు వెళ్తున్న ఫిలిప్పీన్స్ వైమానిక దళ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు.

వాతావరణ నిపుణుల ప్రకారం, కల్మేగీ బుధవారం మధ్యాహ్నానికి పశ్చిమ పాలావాన్ ప్రాంతం దాటి దక్షిణ చైనా సముద్రం వైపు కదిలింది. ఆ సమయంలో దాని స్థిరమైన గాలుల వేగం గంటకు 130 కిలోమీటర్లు, ఈదురు గాలుల వేగం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచాయి

సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బెర్నార్డో రఫేలిటో అలెజాండ్రో IV ప్రకారం, అత్యధిక మరణాలు సిబూలోనే నమోదయ్యాయి. అక్కడ అకస్మాత్తుగా నదులు పొంగి, నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రజలు భయంతో ఇళ్ల పైకప్పులపైకి చేరి సహాయం కోసం అరిచారు. కనీసం 49 మంది మునిగి మరణించగా, మరికొందరు కొండచరియలు, పడిపోతున్న శిథిలాల కింద చిక్కి చనిపోయారు. గల్లంతైన 26 మందిలో 13 మంది సెబులోనే ఉన్నారు.

ఫిలిప్పీన్ రెడ్ క్రాస్ తెలిపిన ప్రకారం, సహాయక సిబ్బందిని ప్రమాదం నుంచి రక్షించేందుకు వరదలు తగ్గే వరకు సహాయక ప్రయత్నాలను ఆపివేశారు.

సెబు గవర్నర్ పామెలా బారిక్వాట్రో మాట్లాడుతూ, “మేము అన్ని చర్యలు తీసుకున్నాం, కానీ ఆకస్మిక వరదలు మాకు పెద్ద సవాల్‌గా మారాయి” అని అన్నారు. ఆమె ప్రకారం, సెబులోని నదులు, కాలువల్లో అధిక మట్టిపొరలు ఏర్పడటం, తక్కువ నాణ్యత గల వరద నియంత్రణ పనులు ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో సిబూ ప్రావిన్స్‌లో అత్యవసర నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

సెబు ప్రాంతం ఇంకా సెప్టెంబర్ 30న సంభవించిన 6.9 తీవ్రత గల భూకంపం నుండి కోలుకుంటోంది. ఆ భూకంపంలో 79 మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

కల్మేగీ తుఫాన్ తాకే ముందు, అధికారులు 3.8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫెర్రీలు, చేపల పడవలు సముద్రంలోకి వెళ్లకుండా నిషేధించారు. దీని వల్ల 3,500 మందికి పైగా ప్రయాణికులు పోర్టుల్లో ఇరుక్కున్నారు. కనీసం 186 దేశీయ విమానాలు రద్దు చేయబడ్డాయి.

అమెరికా రాయబారి మేరీకే కార్ల్సన్ బాధితులకు సంతాపం తెలియజేశారు. “ఫిలిప్పీన్స్ ప్రజలతో మేము ఉన్నాము. అమెరికా సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది,” అని ఆమె ‘ఎక్స్‌’ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, వియత్నాంలో కూడా కల్మేగీ ప్రభావం ఉండనుంది. శుక్రవారం ఉదయం తుఫాన్ అక్కడ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తీరప్రాంతాల్లో పడవలు తీరానికి చేరుకుంటుండగా, స్థానిక అధికారులు ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

అలాగే థాయిలాండ్ వాతావరణశాఖ ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాల కోసం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నుంచి వారాంతం వరకు భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది.

ఫిలిప్పీన్స్ ప్రతి సంవత్సరం సుమారు 20 తుఫాన్లు ఎదుర్కొంటుంది. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటంతో, ప్రపంచంలో అత్యంత ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి.

మౌలిక వసతుల నష్టం

సిబూ, లెయ్టే, పాలావాన్ ప్రావిన్స్‌లలో వంతెనలు, రహదారులు, విద్యుత్‌ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిబూ నగరంలో 30కిపైగా వంతెనలు, 200కి పైగా రహదారులు ముంపుకు గురయ్యాయి లేదా ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయి, దాదాపు 8 లక్షల ఇళ్లు చీకటిలో మునిగిపోయాయి. టెలికమ్యూనికేషన్ టవర్లు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఫోన్‌ సేవలు నిలిచిపోయాయి.

ఆర్థిక నష్టం అంచనా

ప్రాథమిక అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా 18 బిలియన్ ఫిలిప్పైన్ పెసోస్‌ (దాదాపు రూ.26,000 కోట్లు) నష్టం జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. రహదారులు, వంతెనలు, విద్యుత్ సదుపాయాలు పునర్నిర్మాణానికి కనీసం 10 బిలియన్ ఫిలిప్పైన్ పెసోస్‌ అవసరమని అధికారులు తెలిపారు. వ్యవసాయం కూడా తీవ్రంగా దెబ్బతింది. బియ్యం, కొబ్బరి, చక్కెర పంటలు నష్టపోయి 3 బిలియన్ ఫిలిప్పైన్ పెసోస్‌ విలువైన పంటలు నాశనం అయ్యాయి.

ఫిలిప్పైన్ పెసోలు