
ప్రకృతిని దోపిడీ చేయడం అరికట్టాలి: జీ–20 సదస్సులో ప్రధాని మోడీ
ఆఫ్రికాలో తొలిసారిగా జరుగుతున్న జీ–20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ అభివృద్ధి మోడళ్లపై ఘాటుగా ప్రసంగించారు. దశాబ్దాలుగా జీ–20 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతున్నా… ప్రస్తుత అభివృద్ధి నమూనాలు పెద్దఎత్తున జనాభాను వనరుల నుంచి దూరం చేశాయి. ప్రకృతిని అతిగా దోపిడీ చేసే విధానాలకు కారణమయ్యాయి. ఈ దుష్పరిణామాలను అత్యంత ఎక్కువగా అనుభవించిన ఖండం ఆఫ్రికా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ప్రపంచ అభివృద్ధి మాపింగ్ విధానాలను మరోసారి పునర్ విమర్శించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రగతి అంటే ప్రకృతి నాశనం కాదు… అభివృద్ధి అంటే కొందరికి మాత్రమే కాదు, అందరికీ చేరాలి అని ఆయన స్పష్టం చేశారు.
‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ – నో వన్ లెఫ్ట్ బీహైండ్’ సెషన్‌లో మోడీ మాట్లాడుతూ అభివృద్ధి సూచికలను కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత గ్లోబల్ గ్రోత్ పరిమితులు భారీగా జనాభాను వనరుల నుంచీ దూరం చేశాయని, ప్రకృతి దోపిడీకి దారి తీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ దుష్పరిణామాల భారాన్ని అత్యధికంగా భరించేది ఆఫ్రికానేనని గుర్తుచేశారు.
సంస్కృతిలోనే సమాధానం — ఇంటిగ్రల్ హ్యూమనిజం
భారత వేల సంవత్సరాల నాగరికతలో ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ అనే భావన ఉందని, మనిషి–సమాజం–ప్రకృతిని ఒకే సమగ్ర వ్యవస్థగా చూసే దృక్పథమే భవిష్యత్తు అభివృద్ధికి దారి తీస్తుందని మోడీ చెప్పారు.
ప్రకృతి–పురోగతి మధ్య సమతుల్యం రావాల్సిందే. లేకుంటే అభివృద్ధి నిలబెట్టుకోలేం అని వివరించారు.
మూడు కీలక ప్రతిపాదనలు ప్రకటించిన మోడీ
1) గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ
• ప్రపంచంలోని అనేక కమ్యూనిటీలలో శతాబ్దాలుగా ప్రకృతి–స్నేహపూర్వక జీవన విధానాలు కొనసాగుతున్నాయని, ఇవి సుస్థిరతకు మార్గదర్శకాలని పేర్కొన్నారు.
• ఈ సాంప్రదాయ జ్ఞానాన్ని సంకలనం చేసి ప్రపంచానికి పంచేందుకు జీ–20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ ఏర్పాటు చేయాలని సూచించారు.
• భారత్‌లో నడుస్తున్న ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) దీని పునాది కావచ్చని చెప్పారు.
• మన సమిష్టి జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన అన్నారు.
2) జీ20–ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్
• ఆఫ్రికా అభివృద్ధి ప్రపంచ ప్రయోజనమని మోడీ మరోసారి గుర్తుచేశారు.
• ‘ట్రెయిన్–ది–ట్రైనర్స్’ మోడల్‌పై 10 ఏళ్లలో 10 లక్షల సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం లక్ష్యమని చెప్పారు.
• వీరు తిరిగి లక్షలాది ఆఫ్రికన్ యువతకు నైపుణ్యాలు అందిస్తారని, దీని ప్రభావం “మల్టిప్లయర్ ఎఫెక్ట్”లా పనిచేస్తుందని వివరించారు.
• జీ–20 దేశాలన్నీ ఈ కార్యక్రమానికి ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించాలని సూచించారు.
3) డ్రగ్–టెర్రర్ నెక్సస్‌పై ప్రత్యేక జీ–20 ఇనిషియేటివ్
• ఫెంటనిల్ వంటి అత్యంత ప్రమాదకర మత్తుపదార్థాలు వేగంగా వ్యాపిస్తున్నాయని, ఇవి ఉగ్రవాదానికి కీలక నిధి వనరులని మోడీ హెచ్చరించారు.
• దీనిని అణిచివేయడానికి ఫైనాన్స్–గవర్నెన్స్–సెక్యూరిటీ రణతంత్రాలను ఏకం చేసే జీ20 ఇనిషియేటివ్ ఆన్ కౌంటరింగ్ ది డ్రగ్–టెర్రర్ నెక్సస్ ను ప్రతిపాదించారు.
• డ్రగ్–టెర్రర్ కు సంబంధించిన ఆర్థిక మూలాలను బలహీనపరచాలి. ఇదే గ్లోబల్ సెక్యూరిటీకి అత్యవసరం” అని పేర్కొన్నారు.
గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీమ్ కూడా అవసరం
• సహజ విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం జీ–20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
• జీ–20 దేశాల్లో శిక్షణ పొందిన వైద్య నిపుణులతో ఈ బృందం సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షతను ప్రశంసించిన మోడీ
జీ–20 సదస్సు నిర్వహణలో అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అద్భుతంగా వ్యవహరించారని ఆయన అభినందించారు. స్కిల్డ్ మైగ్రేషన్, టూరిజం, ఫుడ్ సెక్యూరిటీ, ఏఐ, డిజిటల్ ఎకానమీ, ఇన్నోవేషన్, మహిళా సాధికారత వంటి అంశాల్లో దక్షిణాఫ్రికా ప్రభావవంతమైన పురోగతి సాధించిందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఇక్కడ మరింత ముందుకు వెళ్లాయని పేర్కొన్నారు.
గ్లోబల్ సౌత్ స్వరం ప్రపంచమంతా వినిపించాలి
భారత–ఆఫ్రికా సాన్నిహిత్యం దృఢంగా కొనసాగుతుందని, ఢిల్లీలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని మోడీ గుర్తుచేశారు. ఈ సహకారం జీ–20 పరిమితులను దాటి ప్రపంచ స్థాయిలో కొనసాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మోడీ–మెలోనీల మధ్య సంభాషణ
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న జి–20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో శనివారం కీలక భేటీ జరిపారు. సదస్సు సైడ్‌లైన్స్‌లో ఇద్దరు నేతలు పరస్పరం అభివాదాలు చెప్పుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. జి–20 వేదికకు చేరుకున్న వెంటనే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మోడీకి స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్య కచేరీలు, సాంస్కృతిక బృందం గీతాలు మోడీ పర్యటనకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. 2016 ద్వైపాక్షిక పర్యటన, 2018–2023 బ్రిక్స్ సమావేశాల తర్వాత దక్షిణాఫ్రికాలో పర్యటించడం మోడీకి నాలుగో సారి.
ఈ సారి జి–20 సదస్సు వరుసగా నాలుగో సంవత్సరం గ్లోబల్ సౌత్‌లో జరుగుతుండటం ప్రత్యేకం. ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ అనంతరం ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. దీంతో అభివృద్ధి కోరుకునే దేశాల స్వరం ప్రపంచ వేదికపై మరింత బలంగా వినిపిస్తోంది. ద్వైపాక్షిక సమావేశాలకు శ్రీకారం చుడుతూ మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్‌బనీస్‌ను కూడా కలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య సహకారం, కొనసాగుతున్న ప్రాజెక్టులపై చర్చలు జరిపారు.
మోడీ జోహన్నెస్‌బర్గ్‌లో భారతీయ వంశీయ టెక్ ఎంట్రప్రెన్యూర్లను, ‘భారత్ కో జానియే’ క్విజ్ విజేతలను కలుసుకున్నారు. భారత సంస్కృతి, చరిత్రను ప్రవాస భారతీయులకు చేరవేయడంలో ఈ క్విజ్ కీలక పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నాస్ పర్స్ చైర్మన్–సిఇఒతో సమావేశమయ్యారు. భారత డిజిటల్ ఎకోసిస్టమ్‌లో పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. భారత టెక్ రంగంపై ప్రపంచ ఆసక్తి మరింత పెరుగుతోందని ఈ సమావేశం సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన గిర్మిటియా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, ‘గంగా మయ్యా’ పాటను విని పరవశం చెందినట్లు తెలిపారు. తమిళంలో కూడా ఆలపించిన ఈ గిర్మిటియా గీతం ప్రవాస భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
