Let's talk: editor@tmv.in
ప్రకృతికి పండుగ ఎప్పుడు వస్తుందో

ప్రకృతికి పండుగ ఎప్పుడు వస్తుందో

Dr.Chokka Lingam
26 అక్టోబర్, 2025

పసివాడి పుస్తకం చెబుతోంది ఇది తెల్లని వెన్నెల శరత్కాలమాట

ప్రకృతి సోయగాలతో మనసు పులకరిస్తుందట

లాలిత్యపు శిరీష పూల పరిమళాల లాహిరులు పరుగెత్తే రోజులట

పిల్లలు ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టి ఆడుకునే రోజులట.

కానీ.. ఈ హైటెక్ హైదరాబాదు లో మాత్రం గాలి వాహనాల వాసనతో నిండిపోయింది.

ఆరు నెలల వానతో పూలు రాలి కుళ్లు వాసన మన ఊపిరిలో నాటుకుపోయింది,

వీధుల గుంతల్లో వ్యాధులు తేలుతున్నాయి,

దోమల గోలలో పిల్లల నవ్వులు వినిపించడం మానేశాయి.

పక్షుల కిల కిల సవ్వడి బదులు అంబులెన్స్ సైరన్‌ల సవ్వడి

ప్రతీ సవ్వడీ మన ఊపిరిని భయపెడుతోంది

దగ్గు, జ్వరాలు, చెమటల ముసురులో కాలం మూలుగుతోంది.

ఆకాశం మబ్బుల కన్నీళ్లతో తడుస్తోంది.

నదులు ఊళ్లను మింగాయి గుంతలు గల్లీలను మింగాయి.

ఆరు నెలలు ఉక్కపోత, ఆరు నెలలు బురద రోత —

మరి ప్రకృతికి పండుగ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నాం

ప్రకృతికి పండుగ ఎప్పుడు వస్తుందో - Tholi Paluku