
ప్రకటనలతో ఎంఎస్ఆర్టీసీకి రూ.250 కోట్ల ఆదాయం తీసుకురావాలి
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(ఎంఎస్ఆర్టీసీ)వచ్చే ఐదేళ్లలో ప్రకటనల ద్వారా రూ.250 కోట్లకు పైగా ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఎంఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 310వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘లాల్ పరివాహనం’ (ఎరుపు బస్సులు)ను కేవలం రవాణా సేవగా కాకుండా ఆదాయం ఆర్జించే వేదికగా మలచడమే లక్ష్యమని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సర్కిల్
ఎంఎస్ఆర్టీసీకి రాష్ట్రంలో 251 డిపోలు, 610కిపైగా బస్ స్టాండ్లు ఉన్నాయి. దాదాపు 12,000 బస్సులు రోజుకు 50–55 లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. బస్సుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య కోటి దాటే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇది ప్రకటన స్థలాల విలువను మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.
టెండర్ల ద్వారా భారీ ఆదాయం
బస్‌స్టాండ్లు, వాటి పరిసర ప్రాంతాలు, బస్సుల లోపలి-బయటి భాగాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ప్రకటనల ద్వారా ఆదాయం పెంచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పోటీ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఐదేళ్లకు రూ.250 కోట్లకు పైగా విలువైన బిడ్లు ఆమోదించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటనల ద్వారా ఎంఎస్ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.22 కోట్ల ఆదాయం వస్తుండగా, కొత్త ఒప్పందాలతో ఈ ఆదాయం రెండింతలకు పైగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత లైసెన్సుల గడువు ముగిసిన తర్వాత కొత్త లైసెన్సీలకు హక్కులు బదిలీ చేస్తారు.
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి
టికెట్ అమ్మకాలపై మాత్రమే ఆధారపడకుండా, ఇతర ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ఆదాయం పెంచుకోవడం సంస్థ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని మంత్రి స్పష్టం చేశారు. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమీకరించగలిగితే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రవాణా కమిషనర్ రాజేష్ నర్వేకర్, ఎంఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా. మాధవ్ కుసేకర్, సంయుక్త కార్మిక కమిషనర్ పల్లవి సహారే తదితరులు పాల్గొన్నారు.
