
పౌల్ట్రీ, హార్టీకల్చర్ రంగాలకు ముందస్తు రక్షణ చర్యలు: సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ పరిస్థితుల్లో ఏర్పడుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో ఏర్పడుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై పడే అవకాశం ఉన్నందున, దాని ప్రభావం ఏపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కనిపించకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రానికి అవసరమైన సరఫరాలు, ఎగుమతులు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల భద్రత వంటి అంశాలను నిరంతరం పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే అక్కడ ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైనప్పుడు వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇక అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా పౌల్ట్రీ, హార్టీకల్చర్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకు గుడ్లు, చికెన్ ఉత్పత్తులు, అరటి, మామిడి, కూరగాయలు వంటి ఉత్పత్తులు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతాయి. రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 20 నుంచి 25 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని అంచనా. ముఖ్యంగా ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ వంటి దేశాలకు ఈ ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయి. అలాగే హార్టీకల్చర్ రంగంలో కూడా అరటి, మామిడి, కూరగాయలు, పుష్పాలు వంటి ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు వెళ్తాయి. సంవత్సరానికి దాదాపు రూ.1,500 నుంచి రూ.2,000 కోట్ల విలువైన హార్టీకల్చర్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని అంచనా. యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా అంతరాయం, సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు, మార్కెట్ డిమాండ్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తితే రైతులు, వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దీనికి చంద్రబాబు స్పందిస్తూ, ముందుగానే పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్కెట్ ఏర్పాటుచేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే యుద్ధ ప్రభావం వల్ల ఎల్పీజీ గ్యాస్, నిత్యవసరాలు వంటి ముఖ్యమైన వస్తువుల సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందో నిరంతరం పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్కెట్లు, సరఫరా మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు.
ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పారు. అలాగే విద్యుత్ వినియోగం, సరఫరా వివరాలను ప్రజలకు పారదర్శకంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఉగాదికి 2.50 లక్షల మంది లబ్దిదారులు సామూహిక నూతన గృహ ప్రవేశం
రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలపై మాట్లాడుతూ ఉగాది సందర్భంగా 2.50 లక్షల మంది లబ్దిదారులకు సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్దిదారులకు ప్రభుత్వం తరపున స్థానిక ప్రజాప్రతినిధులు అధికారికంగా శుభాకాంక్షలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక సరఫరా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సాంకేతిక రంగ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి సారిస్తూ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలు త్వరగా అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి
విద్యా రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సిలబస్ అమలు, మధ్యాహ్న భోజన పథకం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. విద్యార్థులకు తృణధాన్యాలతో తయారు చేసే “చిక్కీ” వంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని సూచించారు.
రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎం వంటి సంస్థల సహకారంతో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచే సంబంధిత కోర్సులను ప్రారంభించాలని సూచించారు.
అలాగే స్టార్టప్‌ల కోసం కాలిబో సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏఐ శాండ్‌బాక్స్ నాలుగు నెలల్లో అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు సహాయం అందించేందుకు “ఏఐ ఆగ్రానమిస్ట్”, విద్యార్థులకు బోధనలో సహాయపడే “ఏఐ ట్యూటర్”, ప్రజలకు ప్రాథమిక వైద్య సలహాలు అందించే “ఏఐ డాక్టర్” సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం తెలిపారు. పేషెంట్లకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా అందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ
అదే సమయంలో డ్రోన్ రంగ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తూ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు. డ్రోన్ ఫ్లయింగ్ ట్రాక్ సిద్ధం చేయడంతో పాటు రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకారంతో అత్యుత్తమ డ్రోన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విమానాల కోసం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలోనే డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు.
అంతే కాకుండా నేర నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీసీటీవీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల కెమెరాలను అనుసంధానించి నేరాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ విధానం ద్వారా నేరస్థులను త్వరగా గుర్తించి నేరాలను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
