
పోషణ్ అభియాన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాలి: అన్నపూర్ణా దేవి
దేశంలో పోషణ్ అభియాన్‌ను ప్రజల భాగస్వామ్యంతో ‘ప్రజా ఉద్యమం’గా మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి అన్నారు. ‘జననానంతర తొలి ఆరు సంవత్సరాల్లో మెదడు అభివృద్ధి వేగం’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఎనిమిదో దఫా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల జీవితంలో తొలి ఆరు సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ఈ కాలంలోనే సుమారు 85 శాతం మెదడు అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల ఈ దశలో సరైన పోషకాహారం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పోషణ్ అభియాన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ , సంయుక్త కార్యదర్శి రాధిక జా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులు, పిల్లలకు సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 8.9 కోట్లకు పైగా లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానమై ఉన్నారని చెప్పారు. వానాకాలం, వేసవి, శీతాకాలం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భిణులు, తల్లులు, పిల్లలకు పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారని ఆమె ప్రశంసించారు. పోషణ్ కార్యక్రమం కేవలం రెండు వారాల ప్రచారంతో ముగిసే అంశం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి అన్నారు. ఒకవైపు పిల్లల్లో అధిక బరువు సమస్య ఉంటే, మరోవైపు తక్కువ బరువు సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. సమతుల ఆహారంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి
పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లతో గడపకుండా తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపాలని ఆమె సూచించారు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలు పిల్లలతో మాట్లాడటం, ఆడుకోవడం వల్ల వారి మానసిక అభివృద్ధి మెరుగ్గా ఉండేదని గుర్తు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల పనిని సులభతరం చేసేందుకు పోషణ్ ట్రాకర్ యాప్‌ను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పిల్లల వయస్సుకు అనుగుణంగా అభ్యాస పద్ధతులను తెలియజేసే ఆధారశీల ఇన్షియేటివ్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పిల్లలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సాక్షం అంగన్‌వాడీ కార్యక్రమం కింద గోడచిత్రాలు, అభ్యాస సామగ్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక సంస్థలు, ఇతర సంస్థలను అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానించే లక్ష్యంతో పంఖూడి పోర్టల్‌ను ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలే దేశ భవిష్యత్తు, అదే సమయంలో దేశానికి పునాది కూడా అని ఆమె అన్నారు. పోషణ్ పక్వాడా కార్యక్రమం 15 రోజులు కొనసాగుతుందని, కానీ పోషకాహారంపై కృషి నిరంతరం కొనసాగాలని మంత్రి పిలుపునిచ్చారు.
