Let's talk: editor@tmv.in
పోలీస్ విధుల్లో ఏఐ విప్లవం: మానవ ప్రమేయం లేకుండా డ్యూటీల కేటాయింపు

పోలీస్ విధుల్లో ఏఐ విప్లవం: మానవ ప్రమేయం లేకుండా డ్యూటీల కేటాయింపు

Gaddamidi Naveen
28 జనవరి, 2026

సాంకేతికత వినియోగంలో హైదరాబాద్ నగర పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకతతో కూడిన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ప్రారంభించారు.

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులతో కలిసి ఈ నూతన విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇప్పటివరకు మాన్యువల్ విధానంలో డ్యూటీ కేటాయింపులు జరగడం వల్ల జాప్యం, అపోహలు తలెత్తేవని, వాటికి శాశ్వత పరిష్కారంగా ఈ సాంకేతిక విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీ సహకారంతో కేవలం రెండు నెలల వ్యవధిలో ఈ జనరేటివ్ ఏఐ విధానాన్ని అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. ‘హంగేరియన్ మెథడ్’ ఆధారంగా సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌లో గడిపిన రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాలకు స్కోర్లు కేటాయించి కంప్యూటరే విధులను ఖరారు చేస్తుంది. ఇందులో అధికారుల జోక్యం పూర్తిగా ఉండదు.

ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్లు క్షణాల్లో రూపొందుతాయి. దీంతో కార్యాలయ పనిభారం తగ్గి, పోలీసులు శాంతిభద్రతల నిర్వహణపై మరింత దృష్టి సారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. సిబ్బంది సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏఐ చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1,796 దరఖాస్తులను పరిశీలించి, సెక్రటేరియట్, సీఎం కార్యాలయం, ట్రాఫిక్, ఇంటర్‌సెప్టర్ వాహనాలు తదితర విభాగాలకు సంబంధించిన 208 డ్యూటీలను విజయవంతంగా కేటాయించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, ఈ విధానం ద్వారా పోస్టింగుల్లో అసంతృప్తి, అపోహలకు తావు లేకుండా సిబ్బందిలో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాథ బాబు, సునీల్ రేగులలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ విధుల్లో ఏఐ విప్లవం: మానవ ప్రమేయం లేకుండా డ్యూటీల కేటాయింపు - Tholi Paluku