
పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ.. కొత్తగా ‘ఫ్యూచర్ సిటీ’ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇటీవల నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించింది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది.
ఈ విజన్ సాధన కోసం రాష్ట్రాన్ని మూడు వినూత్న క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా విభజించి, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది.ఈ వ్యూహం ద్వారా హైదరాబాద్ పరిధిలోని పోలీసు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అనే మూడు పోలీసు కమిషనరేట్ల స్థానంలో నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. తాజా పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్ సిటీ అనే నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పడ్డాయి.
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ను మల్కాజ్‌గిరి పేరుతో మార్చారు. అలాగే హైదరాబాద్ నగరం దాని పరిసర ప్రాంతాలను పరిపాలనా సౌలభ్యం కోసం వేర్వేరు కమిషనరేట్ల పరిధిలోకి తీసుకువచ్చారు. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో ఉన్న రాచకొండ పోలీసు కమిషనరేట్‌ను ఇకపై 'మల్కాజిగిరి' కమిషనరేట్‌గా పిలుస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, నివాస సముదాయాలు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని భద్రత, శాంతి భద్రతల నిర్వహణను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్‌బాబు
హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీగా రమేశ్‌రెడ్డి, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ నగరం, దాని శివారు ప్రాంతాల భౌగోళిక సరిహద్దులను ఈ నాలుగు కమిషనరేట్ల పరిధిలోకి తీసుకువచ్చారు.పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలు శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పునర్వ్యవస్థీకరణతో పోలీసు పరిపాలన మరింత సమర్థవంతమై, ప్రజలకు త్వరితగతిన సేవలు అందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
