
పోలీసు సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: డీజీపీ సి.వి. ఆనంద్
తెలంగాణ పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేలా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసు పిల్లలకు మెరిట్, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లతో పాటు జేఈఈ, నీట్, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. వివాహ, వైద్య, విద్యా రుణాలతో పాటు అదనపు కార్పస్ బీమా, వివిధ గ్రాంట్ల ద్వారా సిబ్బందికి సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య భద్రత పథకం ద్వారా 2025లో 33,126 మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందగా, ఇందుకోసం రూ.181.74 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2026 జూన్ నాటికి మరో 12,392 మంది ఈ పథకం ద్వారా చికిత్స పొందగా, రూ.73.61 కోట్లు వ్యయం చేసినట్లు వివరించారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ.5 లక్షలు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.10 లక్షలు, డీఎస్పీలకు రూ.15 లక్షలు, ఐపీఎస్, అంతకంటే పైస్థాయి అధికారులకు రూ.25 లక్షల బీమా రక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. పథకాల అమలులో పారదర్శకత, నైతికత తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పోలీసు క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీసు పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, స్కాలర్‌షిప్‌లు, వివాహ సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌ను మరింత పెంచాలని సూచించారు.
సంక్షేమ, ఆరోగ్య భద్రత సేవల్లో టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని, లబ్ధిదారుల వివరాలు, నిధుల వినియోగం, సేవల అమలును ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని డీజీపీ ఆదేశించారు. హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీల ఏర్పాటు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దె రేట్లలో పారదర్శకత, శాఖ వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అర్హులైన పోలీసు సిబ్బందికి 9 శాతం వడ్డీతో ఓపెన్ ప్లాట్ రుణాలు, 6.75 శాతం వడ్డీతో గృహ రుణాలు, రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, కుమార్తె వివాహానికి రూ.6 లక్షల వరకు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీలు, పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత విభాగాల అధికారులు, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి అర్హుడైన పోలీసు ఉద్యోగికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
