
పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థల సమన్వయమే బాధితులకు నిజమైన భరోసా: వంగలపూడి అనిత
సమాజంలో చట్టాలు, న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర వెలకట్టలేనిదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో ‘మానవ అక్రమ, రవాణా బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం–1976’పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
కాగా పోలీసు యంత్రాంగం న్యాయ వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే నేరస్థులకు శిక్షలు పడతాయని తద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ఆపరేషన్ ట్రేస్’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు సుమారు 900 మంది అదృశ్యమైన చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని ఆమె వివరించారు. అదేవిధంగా విదేశాల్లో ఉపాధి పేరుతో మోసపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి చెందిన 180 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులకు చట్టం నుండి ఎటువంటి మినహాయింపు ఉండకూడదని పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండా కఠిన శిక్షలు పడేలా చేయడంలో ప్రాసిక్యూషన్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల సరళి మారుతోందని అందుకే పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అధికారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో వివిధ కేసుల విచారణలో ప్రతిభ కనబరిచి దోషులకు శిక్షలు పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను మంత్రి అనిత ప్రత్యేకంగా అభినందించి అవార్డులతో సత్కరించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలన దిశగా ఈ వర్క్‌షాప్ ఒక కీలక మలుపు కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సదస్సులో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వరరావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 200 మంది ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
