Let's talk: editor@tmv.in
పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

Gaddamidi Naveen
23 అక్టోబర్, 2025

సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్‌ ఎంజేఎన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య శిబిరంను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహా బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు సమాజ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. వారి ఆరోగ్యం వారి కుటుంబాల సంక్షేమం పట్ల మనకు బాధ్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్నదన్నారు. పోలీసు కుటుంబాల కోసం ఇలాంటి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం చక్కని ఆలోచనగా అభినందించారు.

మంత్రి అలాగే ఈ హెల్త్ క్యాంప్‌లో 13 రకాల వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారని, గ్రామీణ నుంచి పట్టణాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ప్రతి రోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతోందని ప్రస్తుతం రాష్ట్రంలో 160 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. మరో 80 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సౌకర్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే 80 ట్రామా సెంటర్లను హైవేల వెంట ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

క్యాన్సర్ చికిత్సను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసి కీమోథెరపీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ కాలేజీల‌ ఏర్ప‌టు సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ, 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అందోల్‌లో నర్సింగ్ కాలేజీ, సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్‌తో పాటు ఐదు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు కొత్త భవనాలు ప్రారంభించామని మంత్రి వివరించారు. వాట్పల్లి వద్ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తెల్లాపూర్‌లో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పఠాన్‌చెరువు, నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రులు, సదాశివపేట హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అదనంగా మరో మూడు సబ్ హెల్త్ సెంటర్లను కూడా మంజూరు చేశామని మంత్రి చెప్పారు.

తరువాత మంత్రి హెల్త్ క్యాంప్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, కియోస్క్ ద్వారా స్వయంగా బీపీ చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రముఖ వైద్యులు జిల్లా పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్ - Tholi Paluku