Let's talk: editor@tmv.in
పోలీసుల అదుపులో ఫార్మా యజమాని

పోలీసుల అదుపులో ఫార్మా యజమాని

Panthagani Anusha
10 అక్టోబర్, 2025

తాజాగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 20 మంది చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న కల్తీ దగ్గు సిరప్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో పసిపిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన, వైద్య నిపుణుల విమర్శలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసి సిరప్ నమూనాలను సేకరించి పరీక్షించమని, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా యజమాని జి. రంగనాథన్‌ను మధ్యప్రదేశ్‌ పోలీసులు చెన్నై పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.

దేశాన్ని కుదిపిన దగ్గు సిరప్ విషాదం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం చింద్వారా జిల్లాలో ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ తాగిన తర్వాత 20 మంది చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ల్యాబ్‌ పరీక్షల్లో ఆ మందులో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడంతో, ఈ విషయమై విచారణ చేపట్టిన అధికార యంత్రాంగం విచారణలో భాగంగా ఈ సిరప్‌ను తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్నట్లు నిర్ధారణ అవ్వడం తో ఆ ఫార్మా కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ పై కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు.

అర్ధరాత్రి దాడిలో పట్టుబడిన యజమాని

కేసు నమోదు అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసుబృందం రెండురోజుల నిరంతర కృషి తరువాత చెన్నై పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో కాంచీపురం సమీపంలో రంగనాథన్‌ పట్టుకున్నారు. ఇక అరెస్టు తర్వాత సుంగువర్చత్రం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని చింద్వారా జిల్లాకు తరలించనున్నారు.

మరోవైపు తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అధికారులు రంగనాథంకి సంబంధించిన ఫార్మా కంపెనీ పై తనిఖీ నిర్వహించింది. ఆ తనిఖీలో భాగంగా మందులను కారిడార్లలో నేలపై నిల్వ చేయడం, ప్యాకేజింగ్ లోపాలు, పరిశుభ్రత లేకపోవడం, లేబులింగ్ లోపాలు వంటి సమస్యలు గుర్తించారు. ఈ కారణంగా ప్రభుత్వం ఫ్యాక్టరీని సీజ్ చేసి ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాక దాడి సమయంలో పోలీసులు ఫార్మా కంపెనీకి పత్రాలు, రసాయన పదార్థాలు, ఉత్పత్తి నమూనాలను స్వాధీనం చేసుకున్నారు.

‘కోల్డ్రిఫ్’ సిరప్‌పై రాష్ట్రవ్యాప్త నిషేధం

తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. ఫార్మసీలు, డీలర్లకు ఆ మందు స్టాక్‌ను తక్షణమే వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా ఈ ఘటన మూలంగా దేశవ్యాప్తంగా మందుల నాణ్యత, ఉత్పత్తి నియంత్రణలో లోపాలుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి .అంతేకాక కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు సిరప్ నమూనాలను పరీక్షించమని నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.

సీనియర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పై సస్పెన్షన్ వేటు

ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్ గురువారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ కేసులో ఇద్దరు సీనియర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను ససస్పెండ్ చేశామని వారి నిర్లక్ష్యం వల్లే ఎంతటి పెను విషాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఇన్‌స్పెక్టర్లను గత రెండు సంవత్సరాలుగా శ్రీసన్ ఫార్మా తయారీ యూనిట్‌ను ఎందుకు పరిశీలించలేదని నోటీసులు జారీ అనంతరం వారిని విధి నిర్వహణ సేవల నుంచి తొలగించినట్టు సుబ్రమణియన్ స్పష్టం చేశారు.

పోలీసుల అదుపులో ఫార్మా యజమాని - Tholi Paluku