
పోలీసుల అండతో కాంగ్రెస్ అరాచకాలు చేస్తుంది: హరీష్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. అక్రమ కేసులతో అరెస్టు అయ్యి సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక వార్డులు వచ్చినప్పటికీ, ఎన్నికల ముందు రోజు రాత్రి 12.30 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాలుగు కార్ల కాన్వాయ్‌తో వార్డుల్లో తిరగడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇలా తిరగడంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు.
రాత్రివేళ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారని, గన్‌మెన్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ దురుద్దేశానికి నిదర్శనమన్నారు.
మెడికల్ రిపోర్ట్ లేకుండా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఎలా సాధ్యమవుతుందో పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఘర్షణ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కారు ఎక్కించిన వారిపై, ఆటోకు పెట్రోల్ పోసిన వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. డీజీపీ శివధర్ రెడ్డిని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తకు చెందిన టిప్పర్ లారీని తగలబెట్టినా చర్యలు తీసుకోలేదని, కానీ ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు పెట్టి అరెస్టులు చేశారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 800 కౌన్సిలర్ స్థానాలు, 20 చైర్మన్ పదవులను గెలుచుకుందని తెలిపారు. ప్రజా తీర్పు తమ పార్టీ వైపే ఉందని చెప్పారు. ఎన్నికల కోడ్ పేరుతో ఆపిన రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అక్రమ కేసులు, కాంగ్రెస్ గుండాయిజంపై ప్రభుత్వాన్ని ఎండగడతామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
