
పోలీసులపై ప్రజాభిప్రాయం మారాలి: ప్రధాని మోడీ
దేశంలో పోలీసులపై, ముఖ్యంగా యువతలో ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. వృత్తి నైపుణ్యం, సున్నితమైన సమీక్ష, ప్రజల పట్ల స్పందన మరింత పెంచితేనే ఈ మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 60వ ఆల్ ఇండియా డీజీపీ-ఐజీపీ కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా ప్రసంగించిన మోడీ‘ పోలీసులు ప్రజా నమ్మకాన్ని సంపాదించాలి, వారి మనసుల్లో భద్రతాభావం కలిగించాలి’ అని హితవు పలికారు. ‘వికసిత్ భారత్-సెక్యూరిటీ డైమెన్షన్స్’ అనే అంశంపై మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతకు సంబంధించిన విస్తృత చర్చలు జరిగాయి.
ప్రధాని మోడీ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అప్రమత్తతతో పాటు, నిషేధిత సంస్థలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఎల్పీడబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, తీర ప్రాంతాలు, నివాసం లేని దీవుల భద్రతను నూతన నమూనాలతో బలోపేతం చేయాలని సూచించారు. జాతీయ డేటా వనరులను నేషనల్ గ్రిడ్ తో అనుసంధానం చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని విశ్లేషించి, నేర నియంత్రణకు ఉపయోగించాలన్నారు. ఫోరెన్సిక్ సాంకేతికతను దర్యాప్తులో విస్తృతంగా వినియోగించేందుకు విశ్వవిద్యాలయాలు కేస్ స్టడీలు చేపట్టాలనీ, దాంతో న్యాయవ్యవస్థలో శిక్షితుల శాతం పెరుగుతుందని చెప్పారు.
భారతీయ క్రిమినల్ చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
భారత కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక సురక్షా సంహితలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వీటివల్ల వలస పాలనా చట్టాలకు పూర్తిగా ముగింపు పలికే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మత్తు పదార్థాల వ్యాప్తిని నియంత్రించేందుకు అమలు, పునరావాసం, కమ్యూనిటీ జోక్యం సమన్వయం కావాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. మహిళల భద్రత, దేశాన్ని విడిచి పరారైన నిందితులను రప్పించడం, దీర్ఘకాలిక పోలీసింగ్ విజన్ 2047 వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. సైక్లోన్ దిత్వా వంటి సహజ విపత్తుల సమయంలో రియల్ టైం సమన్వయం, వేగంగా స్పందించడం, ముందస్తు ప్రణాళిక కీలకమని ఆయన సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసింగ్ శైలిని మార్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. పట్టణాల్లో నూతన పోలీసింగ్ నమూనాలు, టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
కాన్ఫరెన్స్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అందజేశారు. ఉత్తమ అర్బన్ పోలీసింగ్ కింద మూడు నగరాలకు తొలిసారి పురస్కారాలు కూడా ప్రధాని ప్రదానం చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, అన్ని రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీలు హాజరయ్యారు. అదనంగా 700 మందికి పైగా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
