Let's talk: editor@tmv.in
‘పోలియో ఫ్రీ’గా ఇండోనేషియా

‘పోలియో ఫ్రీ’గా ఇండోనేషియా

Pinjari Chand
23 నవంబర్, 2025

ఇండోనేషియా ఆరోగ్య రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. రెండు సంవత్సరాల పాటు అనుసరించిన కఠిన విధానాల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇండోనేషియాను పోలియో టైప్–2 వైరస్‌ నుంచి పూర్తిగా విముక్తి పొందిన దేశంగా ప్రకటించింది. 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు పిల్లల్లో, వాతావరణ నమూనాల్లో ఈ వైరస్‌ లేకపోవడంతో నవంబర్‌ 19న డబ్ల్యూహెచ్వో ఈ ప్రకటన చేసింది.

60 మిలియన్లకు పైగా అదనపు టీకాలు

దేశమంతా ఉదృతంగా చేపట్టిన ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 60 మిలియన్‌ డోసులకు పైగా పోలియో వ్యాక్సిన్‌ వేసినట్లు ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రతి పిల్లవాడూ రక్షణ పొందాలి

మన వైద్య సిబ్బంది అంకితభావం, తల్లిదండ్రుల సహకారం, అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుతో పోలియో వ్యాప్తిని అడ్డుకున్నాం. ప్రతి చిన్నారి సంపూర్ణ రక్షణ పొందేలా చూడాలి. కొన్ని ప్రాంతాల్లో టీకా శాతం ఇంకా తక్కువగా ఉండటం ఆందోళనకరం అని దేశ ఆరోగ్య మంత్రి బుడి గునాడి సాదికిన్ హెచ్చరించారు.

వెస్ట్‌ పసిఫిక్‌ ప్రాంతానికి బలమైన సందేశం

డబ్ల్యూహెచ్వో వెస్టర్న్‌ పసిఫిక్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డా. సాయా మావు పియుకాలా మాట్లాడుతూ ఇండోనేషియా విజయం మొత్తం ప్రాంతానికి బలాన్నిస్తోంది. 25 ఏళ్లుగా కొనసాగుతున్న పోలియో–ఫ్రీ హోదా మరింత బలపడింది. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.

2022లో మొదలైన వ్యాధి వ్యాప్తి

అక్టోబర్‌ 2022 ఆచె ప్రాంతంలో తొలి కేసు నమోదైంది. తర్వాత బాంటెన్‌, వెస్ట్‌ జావా, సెంట్రల్‌ జావా, ఈస్ట్‌ జావా, నార్త్‌ మలుకు, సెంట్రల్‌ పాపువా, హైలాండ్‌ పాపువా, సౌత్‌ పాపువాలో నమోదయ్యాయి. చివరగా జూన్‌ 27, 2024గా నమోదైంది.

కొత్త ఎన్ఓపీవీ2 టీకా… ఐపీవీ టీకాల శాతం పెరుగుదల

బలమైన వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం ఎన్ఓపీవీ2 టీకాతో అనేక రౌండ్లు చేపట్టింది. పిల్లల్లో ఐపీవీ రెండో డోస్‌ తీసుకున్న శాతం 2023లో 63శాతం కాగా, 2024లో 73శాతానికి పెరిగింది.

హెక్సావాలెంట్ వ్యాక్సిన్‌ ప్రారంభం

అరు రకాల వ్యాధులకు ఒకే సారి రక్షణ ఇచ్చే హెక్సావాలెంట్‌ వ్యాక్సిన్‌ (డీపీటీ–హెచ్​ బీ–హెచ్​ఐబీ+ ఐపీవీ)ను అక్టోబర్‌ 2025 నుంచి యోగ్యకర్త, వెస్ట్‌ నుసా టెంగ్గారా, బాలి, గ్రేటర్‌ పాపువా ప్రాంతాల్లో అమలు చేశారు. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. 2023, 2024, 2025ల్లో గ్లోబల్‌ పోలియో ఎరాడికేషన్‌ ఇనిషియేటివ్‌ చేసిన సమీక్షల్లో ఇండోనేషియా మూడు సంవత్సరాలు వరుసగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని గుర్తించింది. వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ను పూర్తిగా అడ్డుకోవడం వంటి ప్రమాణాలను నెరవేర్చినట్లు తేలింది.

ఒకటై పనిచేస్తే అద్భుతాలు సాధ్యమే– యూనిసెఫ్

యూనిసెఫ్ ఇండోనేషియా ప్రతినిధి మనిజా జమాన్ మాట్లాడుతూ సమాజం, హెల్త్‌ వర్కర్లు, భాగస్వామ్య సంస్థలు కలిసి పని చేస్తే ఎటువంటి విజయం సాధ్యమవుతుందో ఇది చూపించిందని అన్నారు.

ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం భవిష్యత్తులో నిరంతర పర్యవేక్షణ, రూటీన్ ఇమ్మ్యూనైజేషన్‌ బలోపేతం చేయడం. కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు, పోలియో తిరిగి రాకుండా జాగ్రత్తలు కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విజయంలో ఇండోనేషియా ప్రభుత్వం, డబ్ల్యూహెచ్వో, యూనిసెఫ్, యూఎన్డీపీ, సీహెచ్ఏఐ, రోటరీ ఇంటర్నేషనల్‌, వేలాది మంది హెల్త్‌ వర్కర్లు కీలక పాత్ర పోషించారు.

‘పోలియో ఫ్రీ’గా ఇండోనేషియా - Tholi Paluku