Let's talk: editor@tmv.in
పోలవరం బాధితులకు మూడో విడత పరిహారం..రూ.226 కోట్లు విడుదల

పోలవరం బాధితులకు మూడో విడత పరిహారం..రూ.226 కోట్లు విడుదల

Panthagani Anusha
21 మార్చి, 2026

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది. తెలుగు నూతన సంవత్సరాది 'ఉగాది' పండుగను పురస్కరించుకుని, బాధితులకు మూడో విడత పునరావాస ప్యాకేజీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విడుదల చేశారు. మొత్తం రూ.226 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును ఆయన అమరావతిలో బాధితులకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు ‘ప్రాణాధారం’ అని, ఈ మహా యజ్ఞంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

21 నెలల్లో రూ.1,943 కోట్ల పంపిణీ

ముంపు బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. గత 21 నెలల స్వల్ప కాలంలోనే బాధితులకు మొత్తం రూ.1,943 కోట్ల మేర భారీ పరిహారాన్ని అందజేయడం విశేషం. గతంలో సంక్రాంతి కానుకగా రూ.800 కోట్లు, దీపావళి సందర్భంగా రూ.916 కోట్లు పంపిణీ చేయగా తాజా విడతతో కలిపి బాధితుల ఖాతాల్లోకి నగదు జమ అయింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి దీర్ఘకాలిక జల ప్రయోజనాలు కల్పించాలన్న పట్టుదలతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం పేర్కొన్నారు.

అడ్డంకులను అధిగమించి పనులు వేగవంతం

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనా వైఫల్యాలు, డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం వంటి సాంకేతిక లోపాల కారణంగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సవరించిన ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదికన పనులను ముందుకు తీసుకెళ్తోంది. పునరావాస కాలనీల నిర్మాణం తుది దశకు చేరుకోగా మిగిలిన పనులకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీకరిస్తోంది. సామాజిక బాధ్యతతో పాటు సాంకేతిక సవాళ్లను సైతం అధిగమిస్తూ ప్రాజెక్టును పట్టాలెక్కించినట్లు ప్రభుత్వం తెలిపింది.

వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రాజెక్టు గడువుపై కీలక ప్రకటన చేశారు. "వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే మా లక్ష్యం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డయాఫ్రామ్ వాల్ సహా ఇతర కీలక నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని నిర్దిష్ట గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడించారు. పారదర్శక విధానాలతో పరిహారం చెల్లిస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.

పోలవరం బాధితులకు మూడో విడత పరిహారం..రూ.226 కోట్లు విడుదల - Tholi Paluku