
పోలవరం ప్రాజెక్టులో 18 నెలల్లో 13 శాతం పనులు పూర్తి చేశాం: మంత్రి నిమ్మల
పోలవరం పనుల పురోగతిని కళ్లుండి చూడలేని కబోదిలా వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ కరపత్రిక సాక్షిలో పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారం ఇస్తే 2 శాతం పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు, ఆపార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటన్నారు. 2014-19 హయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయిన విషయాన్ని మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి వివరించారు. పోలవరం పనులు పరుగులు పెడుతున్న విషయాన్ని ఆయన వివరించారు. 2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణ, శ్రద్ధాసక్తులతో ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువు కంటే ముందుగా, అంటే 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తిచేయాలని ఆయన సూచించినట్లు చెప్పారు.
వాస్తవాలు ఇలా ఉండగా, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో చెప్పలేమని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలోని ఇరిగేషన్ మంత్రులు, సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి జగన్ ఈరోజు మాట్లాడటానికి అనర్హులన్నారు. నాడు కేంద్రం రియంబర్స్ చేసిన రూ.3,000 కోట్ల నిధులను మళ్లించేసి, పోలవరాన్ని ముంచేసిన ఘనుడు జగన్ అని హేళన చేశారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానే నిర్మిస్తున్న కొత్త డయాఫ్రం వాల్ 1032 మీటర్లు, అంటే 83 శాతం నేటికీ పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరంలోనే నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1,894 కోట్లు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నట్లు నిమ్మల చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతిని ఆయన వివరించారు. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో తమ శాఖ పనిచేస్తుందన్నారు. జనవరి మొదటి వారంలో సిఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయన చెప్పారు. రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. అలాగే రాయలసీమలోని హంద్రీనీవా, ఉత్తరాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాల అవధిని నిర్ణయించుకుని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి పాల్గొన్నారు.
