
పోలవరం నిర్వాసితులకు రూ.226 కోట్ల పునరావాస ప్యాకేజీ
పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితుల ఖాతాల్లో రూ.226.6 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు చెక్కులు అందజేశారు. సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సీఎం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అ ని పేర్కొన్నారు. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితుల సేవలను కొనియాడారు. వారి త్యాగానికి ప్రతిఫలమే పోలవరం ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని, డయాఫ్రాం వాల్ దెబ్బతిందని సీఎం విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రూ.440 కోట్ల వ్యయం చేసి కట్టిన డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ రూ.వెయ్యి కోట్లతో నిర్మాణం చేపట్టాం. కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మార్చకుండా ఉంటే ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 6-7 ఏళ్ల పాటు ప్రాజెక్టు ఆలస్యం అయిపోయింది. నిర్వాసితులు కూడా పూర్తిగా సెటిల్ అయ్యేవారు. ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదనే అహంకార ధోరణితో గత పాలకులు వ్యవహరించారన్నారు
దీ నిపై నిపుణులతో అధ్యయనం చేయించి కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. వారం రోజుల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
గత 21 నెలల్లో ప్రాజెక్టు పనులను ముమ్మరం చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లు చెల్లించామని వివరించారు. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా మొదటి విడతగా రూ.800 కోట్లు, దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఉగాది సందర్భంగా మూడో విడతగా రూ.226 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.
ప్రాజెక్టు తొలి దశలో 38,068 మంది నిర్వాసితులు ఉన్నారని, ఇప్పటికే 75 కాలనీల్లో 26 పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన 49 కాలనీల నిర్మాణం కొనసాగుతోందని, 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షలు, ఇంటి జాగా కోసం రూ.2 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనులు పూర్తి చేస్తోందని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితులు దళారులను నమ్మి మోసపోవద్దని, చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.3,500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉందని, భవిష్యత్తులో మరిన్ని పనులు కొనసాగుతాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని, నిర్వాసితులందరికీ న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం పునరుద్ఘాటించారు.
