Let's talk: editor@tmv.in
పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు, విచారణ 12కి వాయిదా

పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు, విచారణ 12కి వాయిదా

Gaddamidi Naveen
6 జనవరి, 2026

పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా చేపట్టిన నల్లమల సాగర్ (బనకచర్ల లింక్) ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎదుట తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన నీటి వాటా తగ్గిపోతుందన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ, తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్‌వీ చేసిన వాదనలు రాజకీయంగా మాత్రమే కాకుండా జలహక్కుల పరంగా కూడా కీలకంగా మారాయి.

పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని రాష్ట్రాల మధ్య చర్చలు లేదా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. న్యాయపోరాటం కంటే సామరస్యపూర్వక చర్చలే మేలని అభిప్రాయపడుతూ, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గోదావరి జలాల మళ్లింపుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ, నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ వాదన ప్రకారం, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటాలను పక్కనపెట్టి, మిగులు నీరు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం–నల్లమల సాగర్ లింక్ ద్వారా అదనపు నీటిని మళ్లిస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మొదట ఆమోదించిన పరిధిలోనే పోలవరం ప్రాజెక్టు పనులు ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. ఈ అంశంలో కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్‌వీ, నల్లమల సాగర్ లింక్ అనేది పోలవరం ప్రాజెక్టుకు మొదట ఇచ్చిన అనుమతుల పరిధిని మించి ఉందని స్పష్టం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ వంటి చట్టబద్ధ సంస్థల పూర్తి అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది అంతర్రాష్ట్ర నదీజల చట్టాలకు స్పష్టమైన ఉల్లంఘన అని సింగ్‌వీ వాదించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, నల్లమల సాగర్‌కు మళ్లించేది పూర్తిగా మిగులు నీరేనని వాదిస్తోంది. తెలంగాణ వాటాను ఏమాత్రం తాకడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా, దీనిపై తుది స్పష్టత రావాల్సి ఉందని సుప్రీంకోర్టు భావించింది. అందుకే తక్షణ స్టే ఇవ్వకుండా, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు జనవరి 12కు విచారణను వాయిదా వేసింది.

మొత్తంగా చూస్తే, పోలవరం–నల్లమల సాగర్ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదం కంటే ఎక్కువ. ఇది గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు, భవిష్యత్తు సాగునీటి భద్రతకు సంబంధించిన కీలక అంశం. కమిటీ నివేదిక తెలంగాణ వాదనకు అనుకూలంగా వస్తే కేసు దిశ పూర్తిగా మారే అవకాశం ఉంది. లేదంటే, ఈ వివాదం మరింత కాలం న్యాయపోరాటంగా కొనసాగడం ఖాయం.

పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు, విచారణ 12కి వాయిదా - Tholi Paluku