Let's talk: editor@tmv.in
పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: అంబటి రాంబాబు

పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: అంబటి రాంబాబు

Panthagani Anusha
9 జనవరి, 2026

రాష్ట్ర ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ, తన గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ తప్పిదాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు.

గుంటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రాంబాబు, పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘ జాప్యానికి పూర్తిగా చంద్రబాబు నాయుడే బాధ్యుడని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ లేవనెత్తిన ప్రత్యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, అబద్ధాల ఆధారంగా ఎదురుదాడికి దిగడం చంద్రబాబు అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. పోలవరం ఆలస్యానికి మూలకారణం చంద్రబాబు హయాంలో తీసుకున్న తప్పుడు సాంకేతిక నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు.

డయాఫ్రం వాల్, కాఫర్‌డ్యాం అంశంపై విమర్శలు

అదేవిదంగా కాఫర్‌డ్యాం పూర్తికాకముందే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని రాంబాబు విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర జల సంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్)తో పాటు అంతర్జాతీయ నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అప్పటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. సరైన నదీ మళ్లింపు లేకుండానే కాఫర్‌డ్యాం మూసివేయడం వల్ల వరదలు సంభవించి డయాఫ్రం వాల్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయి జలాశయ ప్రాజెక్టు నుంచి బ్యారేజ్ స్థాయికి పరిమితం చేసేలా నిల్వ స్థాయిలను తగ్గించేందుకు చంద్రబాబు అంగీకరించారని దీని వల్ల సాగునీరు, తాగునీటి సరఫరా మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

దీనికితోడు తెలంగాణ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పదేపదే తాకట్టు పెట్టారని రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే ధోరణి కొనసాగిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంలో జరిగిన ఆలస్యానికి పూర్తిగా చంద్రబాబు నాయుడే బాధ్యుడని రాంబాబు పేర్కొన్నారు.

ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ప్రభుత్వం మారడం ప్రాజెక్టుకు పెద్ద నష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై తగినంత దృష్టి పెట్టకపోవడమే దాదాపు ఆరు సంవత్సరాల ఆలస్యానికి కారణమని ఆయన తెలిపారు. ఆలస్యాల కారణంగా ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిందని డయాఫ్రం వాల్ పనుల కోసం అదనంగా రూ.1,000 కోట్లు అవసరమయ్యాయని చంద్రబాబు వెల్లడించారు.