Let's talk: editor@tmv.in
పోక్సో కేసు నిందితుడి ఘాతుకం.. భార్య, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురి హత్య

పోక్సో కేసు నిందితుడి ఘాతుకం.. భార్య, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురి హత్య

Gaddamidi Naveen
12 జులై, 2026

రంగారెడ్డి జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి తనపై ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబ సభ్యులతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేసిన ఘటన షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో చోటుచేసుకుంది. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం, దైవాలగూడ గ్రామానికి చెందిన పి. రాజ్‌కుమార్ (35) శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ముందుగా షాబాద్‌ పట్టణంలోని బాధిత బాలిక ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న బాలిక తల్లి, అమ్మమ్మపై కత్తి, కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ బాలికను కారులో తీసుకెళ్లి తన స్వగ్రామమైన దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

అక్కడితో ఆగకుండా రాజ్‌కుమార్ తన ఇంటికి వెళ్లి మరింత దారుణానికి పాల్పడ్డాడు. చెరువు నుంచి సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటిలో నిద్రిస్తున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడు, ఏడాదిన్నర వయస్సున్న మరో కుమారుడిని కూడా హత్య చేశాడు. ఈ ఘటనలో భార్య, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మే నెలలో ఓ మైనర్ బాలికను వెంబడించడం, వేధించడం వంటి ఆరోపణలపై రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12తో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదైంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతరం అతడు కొంతకాలం గ్రామం విడిచి వెళ్లిపోయాడు. తర్వాత కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నేరానికి విధించే శిక్ష ఏడేళ్లలోపు ఉండటంతో వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ లభించింది.

బెయిల్ అనంతరం రాజ్‌కుమార్ పోలీసుల ఎదుట హాజరై కౌన్సెలింగ్‌కు కూడా హాజరైనట్లు అధికారులు తెలిపారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి బాలికపై అతనికి తీవ్ర కక్ష పెరిగినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే తన భార్య, ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.

హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు చెప్పినట్లు సమాచారం. అలాగే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని కూడా తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అతడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో రాజ్‌కుమార్‌కు జూదం అలవాటు ఉండేదని, అప్పుల కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశాలకు హత్యలతో సంబంధం ఉందా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు శనివారం షాబాద్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు
TelanganaHyderabadRangaReddyShabadCrimeNewsBreakingNewsPOCSOCaseTelanganaPoliceMurderCaseCrimeAlertJusticeForVictims
పోక్సో కేసు నిందితుడి ఘాతుకం.. భార్య, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురి హత్య - Tholi Paluku