Let's talk: editor@tmv.in
"పొరుగు రాష్ట్రాల వారికి ఇప్పటికే మంట మొదలైంది"- నారా లోకేష్

"పొరుగు రాష్ట్రాల వారికి ఇప్పటికే మంట మొదలైంది"- నారా లోకేష్

Dantu Vijaya Lakshmi Prasanna
17 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విశాఖపట్నంలో ఒక గిగావాట్ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ సంస్థ రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు చేసిన ప్రతిజ్ఞపై జరుగుతున్న వాదోపవాదాల మధ్య, మంత్రి లోకేష్ గురువారం డీకే శివకుమార్‌ను పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఎక్స్ పోస్ట్‌లో, రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులను "కారం"తో పోల్చుతూ, పొరుగు రాష్ట్రాలలో ఉన్న మంత్రులు అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి అసూయ పడుతున్నారు అని లోకేష్ పేర్కొన్నారు. "ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని అంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే ఉన్నట్టున్నాయి. గూగుల్ సంస్థ రాబోయే ఐదేళ్లలో (2025-2030) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1,25,000 కోట్లకు పైగా) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రగటించింది. ఈ పెట్టుబడి ప్రధాన లక్ష్యం, ఒక గిగావాట్ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ స్థాపించడం. ఇది యునైటెడ్ స్టేట్స్ వెలుపల గూగుల్ ఏర్పాటు చేయనున్న అతిపెద్ద ఎఐ హబ్ గా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ గూగుల్ ఎఐ హబ్ ప్రాజెక్ట్ ద్వారా ఐదేళ్ల కాలంలో (2028-2032) సుమారు 1,88,220 ఉద్యోగాలు (ఉపాధి అవకాశాలు) లభిస్తాయి. ఈ సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రెండూ కలిసి ఉంటాయి.ఇది తెలిసిన కొంతమంది పొరుగువారికి ఇప్పటికే మంట మొదలైంది," అని ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో రాశారు.

అంతకుముందు, బుధవారం నాడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఆవిష్కరణలకు "సాటి లేని నగరం“ అని గట్టిగా సమర్థించుకున్నారు. "మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఆవిష్కరణల పరంగా బెంగళూరుకు సాటి లేదు. కొంతమంది తమను తాము మార్కెటింగ్ చేసుకోవడానికి బెంగళూరు పేరును వాడుకుంటున్నారు," అని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు శివకుమార్ బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, "నేను, నారా లోకేష్ లేదా మరెవరి ప్రకటనలపైనా స్పందించను. బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు, 2 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. దేశానికి బెంగళూరు ఐటి రంగం లో చేసిన కృషి అపారం. దానికి సాటి లేదు." అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఎఐ హబ్ ప్రారంభంపై, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, "వారు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లకుండా మేము ఎలా ఆపగలం. వారు అక్కడ అనేక రాయితీలు ఇస్తున్నందున వెళ్తున్నారు. ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందనివ్వండి

" అని అన్నారు. రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి లేకపోవడం గురించి అడిగినప్పుడు, బెంగుళూరు నగరం ఎప్పుడో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా మేము ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు అని ఆయన ధృవీకరించారు. "రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అన్వేషించడానికి విదేశీ ప్రముఖులు మమ్మల్ని కలుస్తూనే ఉంటారు. ఎవరూ బెంగళూరును వదిలి వెళ్లడం లేదు. మేము ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. బెంగళూరు లో ఉన్న మౌలిక సౌకర్యాలు, మానవ వనరులు వాటంతట అవే పెట్టుబడులను ఆకర్షిస్తాయి " అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, గూగుల్ మంగళవారం నాడు, యునైటెడ్ స్టేట్స్ వెలుపల తమ అతిపెద్ద ఎఐ హబ్‌ అయిన ఒక గిగావాట్-స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రకటన న్యూఢిల్లీలో గూగుల్ నిర్వహించిన 'భారత్ ఎఐ శక్తి' అనే కార్యక్రమంలో వెలువడింది.

"పొరుగు రాష్ట్రాల వారికి ఇప్పటికే మంట మొదలైంది"- నారా లోకేష్ - Tholi Paluku