
పొటెత్తిన త్రివేణి సంగమం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో భాగంగా మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా బుధవారం ఉదయం గంగా నది త్రివేణి సంగమంలో కేవలం ఉదయం సమయంలోనే 9 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా బుధవారం సంక్రాంతి పండుగ జరుపుకుంటుండగా, ఉత్తరప్రదేశ్‌లో మకర సంక్రాంతి గురువారం జరుపుకోనున్నారు. మాఘమేళాలో రెండవ ప్రధాన స్నాన ఘట్టమైన మకర సంక్రాంతి స్నానం గురువారం నిర్వహించనున్నారు.
మాఘమేళా ఎస్పీ నీరజ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఘాట్లకు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకల్లా 9 లక్షల మందికి పైగా భక్తులు గంగానదిలో, సంగమంలో స్నానాలు చేసినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రానికి ఈ సంఖ్య కోటి నుంచి కోటిన్నర వరకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భారీ స్థాయిలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని మేళా ప్రాంతంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం 10 వేలకుపైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం, పౌష్ పూర్ణిమ సందర్భంగా 31 లక్షలకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, మాఘమేళా–2024లో పౌష్ పూర్ణిమ నాడు 28.95 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
మాఘమేళా అధికారి రిషిరాజ్ మాట్లాడుతూ, ఈ ఏడాది భక్తుల రద్దీని నియంత్రించేందుకు 42 తాత్కాలిక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో లక్షకు పైగా వాహనాలను నిలిపే సామర్థ్యం ఉందన్నారు. మాఘమేళా 2025–26 కోసం అనేక స్నాన ఘాట్లను నిర్మించామని, భక్తులకు దుస్తుల మార్పిడి గదులు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంగానదిలో తగినంత నీటి మట్టం ఉండేలా కాన్పూర్‌లోని గంగ బ్యారేజ్ నుంచి ప్రతిరోజూ 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 44 రోజుల పాటు జరిగే మాఘమేళా ప్రతి సంవత్సరం హిందూ మాసమైన మాఘంలో (జనవరి–ఫిబ్రవరి) నిర్వహిస్తారు. గంగా, యమునా, పురాణ కథలలోని సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో ఈ మేళా జరుగుతుంది. మాఘమేళా ప్రయాగ్‌రాజ్–2026 జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. కల్పవాసం, పంచకోశి పరిణామం వంటి సంప్రదాయాలతో ఈ మేళా ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
ఈ మాఘమేళాలో ప్రధాన తేదీలు:
జనవరి 15 – మకర సంక్రాంతి
జనవరి 18 – మౌని అమావాస్య
జనవరి 23 – వసంత పంచమి
ఫిబ్రవరి 1 – మాఘి పూర్ణిమ
ఫిబ్రవరి 15 – మహా శివరాత్రి
