Let's talk: editor@tmv.in
పొగాకు రైతులకు భారీ ఊరట: ఎక్సైజ్ డ్యూటీ రద్దుపై ఏపీ హర్షం.

పొగాకు రైతులకు భారీ ఊరట: ఎక్సైజ్ డ్యూటీ రద్దుపై ఏపీ హర్షం.

Dantu Vijaya Lakshmi Prasanna
5 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 1, 2026 నుండి అమలులోకి వచ్చిన ఈ నూతన నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు సాగుదారులు, చిరువ్యాపారుల దశాబ్దాల కాలపు అస్పష్టతకు తెరపడింది. ఎలాంటి బ్రాండ్ లేని, ప్యాక్ చేయని ముడి పొగాకు విక్రయాలపై ఎక్సైజ్ సుంకాన్ని 0% (సున్నా) గా నిర్ణయిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు.

గందరగోళానికి తెర - స్పష్టమైన నిబంధనలు

గతంలో బల్క్ (మొత్తం) పొగాకు విక్రయాలు, బ్రాండెడ్ ఉత్పత్తుల మధ్య పన్ను విధింపులో స్పష్టత లేకపోవడం వల్ల రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చట్టంలోని సంక్లిష్ట నిబంధనల వల్ల అధికారుల వేధింపులు, ఆడిటింగ్ వివాదాలు తలెత్తేవి. తాజా గెజిట్ ద్వారా ఎచ్ఎస్ కోడ్ 2401 కిందకు వచ్చే ముడి పొగాకుకు పన్ను మినహాయింపునిస్తూ కేంద్రం స్పష్టతనిచ్చింది.

ముడి పొగాకు కు అనగా రైతులు సంచుల్లో విక్రయించే ప్యాక్ చేయని పొగాకుకు 0% అని, బ్రాండెడ్ పొగాకు అంటే కంపెనీ పేరున్న సంచులు, చిన్న ప్యాకెట్లు, రీటైల్ బ్రాండెడ్ ఉత్పత్తులకు 18% సుంకం అని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం పై ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందిస్తూ, "కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మక ముందడుగు. దీనివల్ల రైతులకు మార్కెట్‌లో మెరుగైన ధర లభిస్తుంది. అస్పష్టమైన నిబంధనల వల్ల గతంలో రైతులు నష్టపోయేవారు, ఇకపై ఆ పరిస్థితి ఉండదు," అని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, పారదర్శకత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ఈ మార్పులు 2026, ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి. ముడి పొగాకు పేరుతో బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయించి పన్ను ఎగవేసే వారికి ఈ కొత్త గెజిట్ చెక్ పెడుతుంది. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా ఒకేలా, కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డును కోరింది. ఈ నిర్ణయంతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, ఎగుమతులకు కూడా కొత్త జవజీవాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.