Let's talk: editor@tmv.in
పొగాకు రైతులకు అండగా పోరాడతాం: వైఎస్ జగన్‌
పొగాకు రైతులకు అండగా పోరాడతాం: వైఎస్ జగన్‌

పొగాకు రైతులకు అండగా పోరాడతాం: వైఎస్ జగన్‌

Gaddamidi Naveen
23 జులై, 2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరు వల్ల పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారి సమస్యలపై వైయస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాడుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య పొగాకు రైతులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. రైతుల కష్టాలను విన్న ఆయన, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసానిచ్చారు. ఈ దిశగానే రాబోయే 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి రైతులకు నేరుగా అండగా నిలవనున్నట్లు వెల్లడించారు.

94 రోజులు గడిచినా 16.5శాతం కొనుగోళ్లే

సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పొగాకు వేలం మొదలై 94 రోజులు గడిచినా, పండిన 232 మిలియన్ కేజీల పంటలో కేవలం 38 మిలియన్ కేజీలు (16.5 శాతం) మాత్రమే కొనుగోలు చేయడం దారుణమన్నారు. సాధారణంగా 100 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉండగా, ఈ నెమ్మది ప్రక్రియ వల్ల రైతులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. సెప్టెంబరులో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే ఇక్కడి ట్రేడర్లు అటు వెళ్లిపోతారని, అప్పుడు ఏపీ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు సమీక్షలు నిర్వహించి పొగాకు ధర కేజీ రూ.200 కు తగ్గకూడదని చెప్పిన మర్నాడే.. పొదిలి, టంగుటూరు, కనిగిరి, కందుకూరు, జంగారెడ్డిగూడెం, గోపాలపురం కేంద్రాల్లో ధరలు రూ.170 నుంచి రూ.186కి పడిపోయాయని గుర్తుచేశారు. ఇది వ్యాపారులు సిండికేట్‌గా మారారనడానికి నిదర్శనమని, చంద్రబాబు మాటలకు మార్కెట్‌లో విలువ లేకుండా పోయిందని విమర్శించారు.

సిండికేట్ వ్యవస్థను బ్రేక్ చేయాలంటే 'మార్క్ ఫెడ్' రావాలి

పోటీ వాతావరణం కల్పించి రైతులకు మంచి ధర అందించాల్సిన టుబాకో బోర్డు వ్యవస్థ, చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైందని జగన్ మండిపడ్డారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు. మా ప్రభుత్వ హయాంలో రైతుల రక్షణ కోసం మార్క్ ఫెడ్‌ను పోటీగా రంగంలోకి దించాం. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపించడంతో సిండికేట్ బ్రేక్ అయి, పోటీ పెరిగిందన్నారు. దానివల్ల 2023–24లో పొగాకు సగటు ధర రూ.289 కాగా, అత్యధికంగా కేజీ రూ.411 వరకు పలికిందని, అది అత్యుత్తమ ధర అని కేంద్రం కూడా ప్రశంసించిందని ఆయ‌న‌ గుర్తుచేశారు.

రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే రెండు పనులు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మార్క్ ఫెడ్‌ను కొనుగోళ్ల రంగంలోకి దించాలని, రైతులకు నష్టం కలిగిస్తూ, పంటను తిరస్కరిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. అష్యూరెన్స్ ఇచ్చిన క్వాంటిటీని న్యాయమైన ధరకు కొనుగోలు చేసేలా లైసెన్స్‌దారులను బాధ్యులను చేయాలని జ‌గ‌న్ సూచించారు.

వైయస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మక మార్పులు

తమ ప్రభుత్వంలో 'సీఎం-యాప్', ఆర్‌బికే వ్యవస్థల ద్వారా ఏ పంట ధర పడిపోయినా వెంటనే జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా కొనుగోలు చేసేవారని తెలపారు. ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూశామని, కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా లేదనే సందేశం వెళ్లడం వల్లే దళారులు సిండికేట్‌గా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆయ‌న ఆరోపించారు.

సమావేశంలో రైతులు, నాయకుల ఆవేదన

వైయస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొగాకు ధర ప్రతిరోజూ పడిపోతోందని, ప్లాట్‌ఫామ్స్ మీద 27 నుంచి 40 శాతం వరకు రిజెక్షన్స్ ఉంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్వయంగా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోతే రైతులు కోలుకోలేరన్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన టుబాకో బోర్డు మెంబర్ మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రభుత్వం స్వయంగా పొగాకు కొనుగోలు చేసి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 2.30 లక్షలు సాగు ఖర్చవుతుంటే, కొనుగోళ్లు లేక ప్లాట్‌ఫామ్స్ నుంచి రైతులు పొగాకును వెనక్కి తీసుకెళ్తున్నారని, ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఫిబ్రవరి వరకు వేలం సాగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.