
పొగాకుపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటాం: నిర్మలా సీతారామన్
పొగాకు ఉత్పత్తులపై కొత్తగా విధించబోయే ఎక్సైజ్ డ్యూటీ అదనపు పన్ను కాదని, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ముగిసినా పొగాకు వంటి ‘డీమెరిట్ గూడ్స్’పై పన్ను భారం తగ్గకుండా చూసేందుకే ఈ చట్టం తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలతో 41 శాతం వాటా ప్రకారం పంచుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం లోక్‌సభలో సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025 చర్చకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. తర్వాత బిల్లును వాయిస్ ఓటుతో ఆమోదించారు. ఇది కొత్త పన్ను కాదు, అదనపు పన్ను కాదు, సెస్ కూడా కాదు. జీఎస్టీ రాకముందు ఉన్న ఎక్సైజ్ డ్యూటీనే తిరిగి తెస్తున్నాం. ఈ డ్యూటీ నుంచి వచ్చే మొత్తం ఆదాయం డివిజిబుల్ పూల్‌లోకి వెళ్తుంది. అందులోంచి ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం 41 శాతం రాష్ట్రాలకు ఇస్తాం” అని నిర్మలా వివరించారు.
సిగరెట్లు చవకగా రాకూడదు
కోవిడ్ సమయంలో రాష్ట్రాల జీఎస్టీ నష్టపరిహారం కోసం తీసుకున్న రూ.2.69 లక్షల కోట్ల రుణం మరో రెండు వారాల్లో పూర్తిగా తీరిపోతుందని, అందుకే కాంపెన్సేషన్ సెస్ ముగియబోతోందని మంత్రి తెలిపారు. సెస్ ముగిస్తే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు చవకగా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉందని, అది జరగకుండా ఉండేందుకు ఎక్సైజ్ డ్యూటీని తిరిగి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సిగరెట్లు ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలో ఉండకూడదు. అదే మా లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గత దశాబ్దంలో భారత్‌లో సిగరెట్లు చవకగా అయ్యాయని, ధరలు స్థిరంగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. జీఎస్టీ వచ్చిన 2017 నుంచి సిగరెట్లపై సెస్ రేటు ఒక్కటే ఉందని, కానీ జీఎస్టీకి ముందు ప్రతి సంవత్సరం ఎక్సైజ్ డ్యూటీ పెంచేవారమని గుర్తు చేశారు.
కొత్త ఎక్సైజ్ రేట్లు
28శాతం జీఎస్టీ + వేర్వేరు రేట్లలో కాంపెన్సేషన్ సెస్
కొత్తగా: వెయ్యి సిగరెట్లకు రూ.2,700 నుంచి రూ.11,000 వరకు ఎక్సైజ్
పొగాకు (కిలో): 60–70 శాతం
నమిలే పొగాకు (కిలో): 100 శాతం
బీడీలపై పన్ను భారం మార్పు లేదు
భారత్‌లో సిగరెట్లపై మొత్తం పన్ను భారం ఇప్పుడు రిటైల్ ధరలో కేవలం 53 శాతం మాత్రమేనని, కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం కనీసం 75 శాతం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు 80–85 శాతం వరకు పన్ను విధిస్తున్నాయని గుర్తు చేశారు.
రైతుల ఆందోళనపై సమాధానం
పొగాకు సాగు చేసే రైతుల జీవనోపాధి దెబ్బతినకూడదన్న ఎంపీల ఆందోళనపై మంత్రి స్పందిస్తూ పొగాకు సాగు నుంచి రైతులను దూరం చేసి, ఇతర పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ పూర్తిగా తొలగిపోతుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యసభలోను ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టంగా మారనుంది.
