Let's talk: editor@tmv.in
పైడిమాంబ సేవలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు

పైడిమాంబ సేవలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు

FL - SIMHCLM
7 అక్టోబర్, 2025

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, గజపతుల ఆడపడుచు శ్రీపైడితల్లి అమ్మవారిని, మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం దర్శించుకున్నారు. సంప్రదాయానుసారం అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా కోట నుంచి బయలుదేరి, మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు.

పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గారి కుమార్తె, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఏడాదిలోగా ఆలయ అభివృద్ధి పనులు

ఏడాదిలోగా పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అశోక్ గజపతిరాజు అన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే అభివృద్ధి పనులను మొదలు పెట్టామని, వచ్చే ఏడాది అమ్మవారి పండగ లోపల అవన్నీ పూర్తవుతాయని చెప్పారు. పైడితల్లి అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు.

పైడిమాంబ సేవలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు - Tholi Paluku