Let's talk: editor@tmv.in
పేర్లు తొలగించిన వారికి ఓటుతో బదులు ఇవ్వండి: మమతా

పేర్లు తొలగించిన వారికి ఓటుతో బదులు ఇవ్వండి: మమతా

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. శంషేర్‌‌గంజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) సమయంలో పేర్లు పోయిన వారు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించారు. ఓటర్ల పేర్లు తొలగించిన చర్యలకు వ్యతిరేకంగా ఓటు ద్వారా సమాధానం ఇవ్వాలని అన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పటి వరకు పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పరోక్షంగా విమర్శలు చేసిన మమతా, ఓటర్ల పేర్ల తొలగింపునకు ఆయనే కారణమని ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా రాజకీయ పోరాటానికి రండి అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకుండా చేసే ప్రయత్నాలు ఉండొచ్చని ఆమె ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో యంత్రాలను మరమ్మతు చేయడానికి అనుమతించకుండా కొత్త ఈవీఎంలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని పార్టీ బూత్‌ ఏజెంట్లకు సూచించారు.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పోరాడా

ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ముస్లింల ప్రయోజనాల కోసం తాను కృషి చేయలేదని బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు. వక్ఫ్‌ యాక్ట్‌ అమలుకు వ్యతిరేకంగా తాను పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్లీ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇదే సమయంలో, ఎన్నికల కమిషన్ అధికార పరిధి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలోని కొందరు అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం కూడా ఆమె విమర్శించారు. మహిళల కోసం అమలు చేస్తున్న లక్ష్మీర్ భండార్ పథకం కొనసాగుతుందని, తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు జీవితాంతం ఆర్థిక సహాయం అందిస్తామని మమతా హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు రూ.1500 సహాయం అందించే భండార్ యువ సాథీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.