
పేర్ని నానీ.. రెడ్ లైన్ దాటేశావ్.. ఇక వదిలిపెట్టం
మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నారని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో రోడ్ల విస్తరణపై మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంత్రి రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలను వేధించడమే పనిగా పేర్ని నాని రాజకీయ జీవితం
‘పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్ని, వ్యాపారుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాను తప్ప మరెవరూ ఉండకూడదు అనేలా పేర్ని నాని వ్యవహరిస్తున్నారని, మచిలీపట్నం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్వర్గీయ పెదశింగు లక్ష్మణరావును రాజకీయంగా సమాధి చేసేందుకు అతని కుమారుడికి కౌన్సిలర్ టికెట్ ఇప్పించి, అతనికి వ్యతిరేకంగా పావులు కదిపి ఓడించారన్నారు. 1999లో నడకుదిటి నరసింహరావు మంత్రిగా ఉన్నపుడు అనేక రకాలుగా వేధించారన్నారు. తర్వాత నన్ను తప్పుడు కేసులో ఇరికించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారన్నారు. పేర్ని నాని 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా తండ్రి, తాత గారు 1950 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల్ని అసైన్డ్ భూములు అని ప్రచారం చేసి కొట్టేయాలని ప్రయత్నిస్తే.. మేము తాడో పేడో అన్నట్లు పోరాడి సాధించుకున్నామన్నారు. 2014లో ఎన్నికలకు ముందు నాపై ఇన్ కంట్యాక్స్ తో సోదాలు నిర్వహించి వేధించార’న్నారు.
కొనకళ్ల బుల్లయ్యతో కలిసి భూములు కొట్టేశానని చెప్పడానికి సిగ్గుపడాలి
‘కొనకళ్ల బుల్లయ్య, నేను కలిసి భూములు కొట్టేశామని చెప్పడానికి పేర్నినాని సిగ్గుపడాలన్నారు. 2009లో అగ్రిమెంట్ చేసుకుంటే దానికి మోకాలడ్డి, 2016లో బుల్లయ్య సెటిల్ చేయడంతో అప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని పేర్ని నానికి తెలియదా..? నేను మంత్రిగా ఉన్నప్పటికీ.. చట్టబద్దంగానే నడచుకున్నాం తప్ప ఎక్కడా తప్పు చేయలేదన్నారు. మచిలీపట్నంలో కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను కూడా నాకు అంటగట్టాలని చూస్తే చెప్పులు తెగేలా కొడతామ’ని మంత్రి రవీంద్ర హెచ్చరించారు.
మిస్టర్ నానీ.. దమ్ముంటే రా.. అభివృద్ధిపై చర్చిద్దాం
‘మిస్టర్ నానీ.. దమ్ముంటే రా... రాజకీయంగా బందరకు నువ్వేం చేశావో. నేనేం చేశానో తేల్చుకుందాం. అంతేగానీ.. పిచ్చి పిచ్చిగా వాగి ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలనుకుంటే చెప్పులు తెగేలా కొడతాం. ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పుకునే పేర్ని నానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి..? ముడా భూముల్ని అక్రమంగా తవ్వేసి లక్షల ట్రిప్పుల మట్టి తరలించడం వాస్తవం కాదా..? మంగలేరు వద్ద 7 ఎకరాల భూముల్ని లెవల్ చేయించుకున్నావ్. ఆ మట్టి ఎక్కడి నుండి తెచ్చావ్..? మైనింగ్ పర్మిట్లున్నాయా..? వాసవి వెంచర్ నీది కాదా. దాన్ని లెవల్ చేయడానికి ముడా భూములు తవ్వేయడం వాస్తవం కాదా..?’ అని ప్రశ్నించారు.
పేర్ని నానికి వయసు పెరిగేకొద్దీ ఇంగిత జ్ఞానం నశిస్తోంది
‘పేర్ని నానికి వయసు పెరిగే కొద్దీ.. ఇంగితం నశించిపోతున్నట్లుంది. బందరులోని రంగనాయకుల స్వామి దేవాలయానికి చెందిన భూముల్ని వేలం పెట్టించి, సిండికేట్ ఏర్పాటు చేసి కొనుగోలు చేసి, వాటిని మామయ్య, భార్య పేరుతో రాయించుకోవడం వాస్తవం కాదా..? అందులో ఉన్న హైటెన్షన్ వైర్లను కనీసం రూపాయి చలానా చెల్లించకుండా మళ్లించుకోవడం నిజం కాదా..? రోడ్డు విస్తరణ విషయంలో హడావుడి చేస్తున్న పేర్ని నానిని అడుగుతున్నా.. 2006లో రోడ్డును కొట్టేసి, 2011లో 40 అడుగులకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది నీవు కాదా అని ప్రశ్నించారు. సమస్య ఉందని ప్రజలు చెప్పినపుడు స్థానిక ఎమ్మెల్యేగా నేను, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి పరిష్కరిస్తాం. గతంలో మెడికల్ కాలేజీ పేరుతో చుట్టు పక్కల ఎర్ర జెండాలు పాతిస్తే..’ తాము పోరాడి రైతులకు న్యాయం చేయించామన్నారు.
