
పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం:
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిని మించిన అంతర్జాతీయ విద్యను ఉచితంగా అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వర నగర్‌లో వక్ఫ్ బోర్డుకు చెందిన ఐదు ఎకరాల స్థలంలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్' నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌లతో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పేదరికం నుంచి వచ్చా.. విద్య విలువ తెలుసు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ నేను కటిక పేదరికం నుంచి వచ్చిన వాడిని. చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అందుకే నెల్లూరులో పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని సంకల్పించాను అని తెలిపారు. గత ఎన్నికల సమయంలో 84 వేల ఇళ్లను సందర్శించినప్పుడు ప్రజల కష్టాలను చూసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఇప్పటికే వీఆర్సీ పాఠశాలను ఆధునికీకరించామని అదే స్ఫూర్తితో నగరంలోని మరో 14 పాఠశాలలను తన కుమార్తె షరణి ఇతర దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
దాతల సహకారం.. రూ. 200 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 20 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. దీని డిజైన్‌ను ఎన్‌సీసీ గ్రూప్ సిద్ధం చేసిందని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి నిర్మాణం పూర్తి చేసి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 1000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు. నెల్లూరు నగరంలో మొత్తం రూ.200 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ఇందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, సుధాకర్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, రెడ్డి ల్యాబ్స్, టీవీఎస్ వంటి సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.
ముస్లిం మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూ స్కూల్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు మైనారిటీ నేతలు, టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా, మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ నందన్, మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
