Let's talk: editor@tmv.in
పేదవాడి సొంతింటి కల సాకారం.. మలివిడతగా నేడు 2.5 లక్షల గృహ ప్రవేశాలు

పేదవాడి సొంతింటి కల సాకారం.. మలివిడతగా నేడు 2.5 లక్షల గృహ ప్రవేశాలు

Panthagani Anusha
30 మార్చి, 2026

రాష్ట్రంలోని పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తూ ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రతీ ఒక్కరికీ ఇల్లు’ అనే లక్ష్యంతో చేపట్టిన సామూహిక గృహప్రవేశాల పరంపరలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో ఏకకాలంలో 2.5 లక్షల గృహాల పంపిణీ జరగనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వేదికగా నిర్వహించే ఈ మెగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించనున్నారు.

21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పేదల గృహ నిర్మాణ రంగంలో రికార్డు స్థాయి పురోగతిని సాధించింది. గత ఏడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా ఇప్పుడు మరో 2.5 లక్షల ఇళ్లను సిద్ధం చేసింది. వీటిలో ఒక లక్ష టిడ్కో ఇళ్లు కాగా మిగిలిన 1.50 లక్షలు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించినవి. కేవలం 21 నెలల కాలంలోనే మొత్తం 5.50 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లను అందించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది.

షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు నాయుడుపేట మండలం పుదూరు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా స్థానిక నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఇక సొంతింటి కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి సాయంత్రం 4.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పీ4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొంటారు. ఈ వేడుకల అనంతరం రాత్రి 8.50 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా తిరుపతి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.