Let's talk: editor@tmv.in
పేదవాడి భూమిని ప్రభుత్వమే కబ్జా చేస్తోంది: కవిత

పేదవాడి భూమిని ప్రభుత్వమే కబ్జా చేస్తోంది: కవిత

Gaddamidi Naveen
11 మార్చి, 2026

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో ఇళ్ల కూల్చివేతల ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సోమవారం రాత్రి నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద దీక్ష కొనసాగిస్తున్న సమయంలో ఆమెతో పాటు పలువురు మద్దతుదారులను పోలీసులు నిర్బంధించారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించారు.

ఫిబ్రవరి 2026లో ఖమ్మం నగరం సమీపంలోని వెలుగుమట్ల గ్రామంలోని వినోబా నగర్లో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసింది. ఈ చర్యను నిరసిస్తూ కవిత సోమవారం బాధితులను కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం జెడ్పీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ధర్నాకు దిగారు. అనుమతి లేదన్న కారణంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి విడుదల చేసినప్పటికీ, నిరసనను ఆపకుండా ఆమె అంబేడ్కర్ భవనంలో నిరాహార దీక్షను ప్రారంభించారు.

దీక్షా స్థలం నుంచి కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అత్యంత దురదృష్టకరం. ఇళ్లు కోల్పోయిన వారిని ఉంచిన షెల్టర్ అధ్వాన్నంగా ఉన్నాయి అని ఆమె మండిపడ్డారు. బాధితులను పరామర్శించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరినా ఆయన స్పందించలేదని, అందుకే తాము నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఎక్కడైతే ఇళ్లను కూల్చివేశారో, అదే స్థలంలో పేదలకు తిరిగి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

అనంత‌రం మంగళవారం తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో క‌విత‌ ఇళ్ల కూల్చివేతల ఘటనపై నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కూల్చివేసిన ఇళ్ల స్థానంలోనే పేదలకు మళ్లీ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని వెల్లడించారు. కేవలం ఖమ్మమే కాక, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను 'హైడ్రా' పేరుతో కూల్చుతోంది. పెద్దల కట్టడాలను వదిలేసి, సామాన్యులపై జులుం ప్రదర్శిస్తుండటం అత్యంత అన్యాయమ‌ని ఆమె పేర్కొన్నారు.

వెలుగుమట్లలో సుమారు 30 ఎకరాల భూదాన్ భూమి, మరో 30 ఎకరాల ఆక్రమిత భూమి కలిపి మొత్తం 62 ఎకరాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. భూదాన్ భూమి అంటే పేదలకు ఇచ్చిన భూమి అని, అలాంటి భూమిలో ఉన్న ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చి భూమిని పెద్దలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.