
పేదవాడికి 'సంజీవని' లాంటి బాలవికాస వాటర్ ప్లాంట్లు: హరీష్ రావు
కాజీపేటలో నిర్వహించిన బాలవికాస వాటర్ ప్లాంట్ల వార్షికోత్సవ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గ్రామ స్థాయి ప్రతినిధులు, మూడు వేల మందికి పైగా నాయకులు హాజరయ్యారు. సభకు విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక అభివందనాలు తెలియజేసిన ఆయన, “సమర్థ నాయకత్వం – సమగ్ర అభివృద్ధి” అనే ఈ ఏడాది థీమ్ ప్రస్తుత పరిస్థితులకు అత్యంత సమంజసమని అన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల క్రితం వరంగల్ కేంద్రంగా బాల థెరిస్సా, ఆండ్రే దంపతులు ఈ సంస్థను స్థాపించారని తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఉచిత సహాయం అందించడం కాకుండా, వారు స్వయంగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా చైతన్యం కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పల్లెల్లో ఫ్లోరైడ్ సమస్యలు, కలుషిత నీటి కారణంగా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు బాలవికాస చేపట్టిన వాటర్ ప్లాంట్ల కార్యక్రమం విశేష ఫలితాలు సాధించిందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య రక్షణతో పాటు పేద కుటుంబాలకు భారీ ఆసుపత్రి ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పారు. ఈ ప్లాంట్లు గ్రామాలకు సంజీవనిలా నిలిచాయని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించి మొత్తం 1600 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గొప్ప విజయమని, రోజుకు సుమారు 30 లక్షల మందికి స్వచ్ఛమైన నీరు అందించడం గర్వకారణమని అన్నారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను గ్రామ ప్రజలకే అప్పగించడం వల్ల కమ్యూనిటీ ఓనర్‌షిప్ పెరిగి ప్రాజెక్టు విజయవంతమైందని ఆయన తెలిపారు.
గ్రామాల్లో ఉన్న ఐక్యత, పరస్పర సహకారం పట్టణాల్లో తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, పుట్టిన మట్టికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర నాయకత్వం అవసరాన్ని ప్రస్తావిస్తూ, సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటే సమాజం దీర్ఘకాలం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు. బాలవికాస కేంద్రానికి ఉచిత విద్యుత్ అందించేందుకు శాసనసభలో ప్రస్తావించి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామాభివృద్ధి దిశగా మరింత ప్రేరణనివ్వాలని ఆకాంక్షించారు.
