
పేదల స్థలాలను స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం: వైసీ పీ
సుమారు 20 ఏళ్లుగా పేదల స్వాధీన అనుభవంలో ఉన్న భూముల్లో అకస్మాత్తుగా తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేయడం సరికాదని వైసీపీ ప్రజాప్రతినిధులు అన్నారు. బద్వేలు మండలం గుంతపల్లె గ్రామం రెవెన్యూ సర్వే నంబర్ 958/2లో పేదలకు కేటాయించిన స్థలాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ఆదివారం పరిశీలించారు. ఇటీవల కట్టడాలు కూల్చివేయడంతో తమ స్థలాల వద్దే నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులను పరామర్శించి, స్థలాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఇంటి పట్టాలు ఉండి ఏళ్ల తరబడి స్వాధీనంలో ఉన్న పేదల స్థలాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 1996 నుంచి వివిధ దశల్లో పట్టాలు పొందిన పేదల స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి చదును చేయడం అన్యాయమన్నారు.
అధికారులను తప్పుదోవ పట్టించారు
కొంతమంది టీడీపీ నాయకులు బినామీ పట్టాల పేరుతో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ అంశంపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని, రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్టీఆర్ కాలనీ ఏర్పాటుకు తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే పట్టణంలో అనువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ, ఇప్పటికే పట్టాలు పొందిన పేదల భూముల జోలికి రావడం సరికాదని అన్నారు. ఈ విషయంపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను క్షుణ్ణంగా వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా శ్రీరాములు, రైతు విభాగం జిల్లా కార్యదర్శి చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ రామ్మోహన్, వార్డు ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
