Let's talk: editor@tmv.in
పేదల సొంతింటి కల సాకారం చేయాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

పేదల సొంతింటి కల సాకారం చేయాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై గట్టిగా గళమెత్తారు. ప్రధానంగా పేదల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో, గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా, ఇప్పటికీ పేదలకు అందకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణంలో 500 ఇళ్లు, కమలాపూర్‌లో 350, మరిపెళ్లి గూడెంలో 50, జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో 200, బూజునూర్ గ్రామంలో 50 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని సభలో వివరించారు. ఈ ఇళ్లను తక్షణమే పంపిణీ చేసి పేదల ఆశలను నెరవేర్చాలని ఆయన కోరారు.

అదేవిధంగా, జమ్మికుంట పట్టణంలో నిర్మాణంలో ఉన్న మరో 300 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తే త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించవచ్చని సూచించారు. దీనిపై స్పందించిన సంబంధిత శాఖ మంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అకాల వర్షాల బాధితులకు అండగా ఉండాలి

ఇక రైతుల సమస్యలను కూడా కౌశిక్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వీణవంక, జమ్మికుంట మండలాల్లో వెయ్యి ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సభలో స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపించడంతో హుజూరాబాద్ ప్రజలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇళ్ల కేటాయింపు, అటు రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే శుభవార్త వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

పేదల సొంతింటి కల సాకారం చేయాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - Tholi Paluku