
పేదరికం నుంచి ‘పద్మశ్రీ’ వరకు
ఎన్నో రకాల వివక్షలు, ఇంకెన్నో పరిమితులు స్త్రీలకు మన సమాజంలో అయినప్పటికీ వాటన్నింటిని అధిగమించి డాక్టర్ కావాలన్న తన లక్ష్య్యాన్ని సిధ్దింపజేసుకోవడం అదికూడా అరకొర సదుపాయాలు కలిగిన 50 సంవత్సరాల క్రితమే అంటే అది మరెన్ని సవాళ్లతో కూడుకున్నదో ఊహించడం కష్టం కాదు. అలా 70 సంవత్సరాలకు పూర్వమే పేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించే ఆంకాలజిస్ట్ గా ప్రఖాతిగాంచిన మహిళ గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ విజయలక్ష్మీ దేశ్మానే.
విజయలక్ష్మీ కర్ణాటక రాష్ట్రంలోని జెవర్గి తాలూకా లోని కొబాల్ గ్రామంలో 1955లో జన్మించారు. తండ్రి బాబురావు దేశ్మానే ఎంఎస్కే మిల్లులో కార్మికుడిగా ఉండేవారు. తల్లి రత్నమ్మ ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్మేవారు. ఇలా అత్యంత పేద కుటుంబంలో జన్మించారు. అది మాత్రమే కాదు తీవ్రమైన వివక్ష కలిగిన ఆరోజుల్లో దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి డాక్టర్ గా రాణించడం అనేది అంత సులభమైన విషయం కాదు. గాజీపూరలో స్కూల్ విద్యను పూర్తిచేశారు ఆమె. ఆ సమయంలో కూడా విజయలక్ష్మీ తన తల్లిదండ్రులకు ఆమె తనకు వీలైనంతలో సాహాయంగా ఉండేవారట.
డాక్టర్ కావాలనే కాంక్ష
కూలీగా పనిచేసే విజయలక్ష్మి తండ్రి అనారోగ్యానికి గురైన ప్రతిసారీ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేవారట. ఆమె ఐదవ తరగతిలో ఉన్నప్పటి నుంచే ఆమెను సర్జన్ గా చూడాలనేది తన కోరిక అని తరచుగా చెప్పేవారట. ప్రతిరోజూ భోజనం దొరకడమే గగనమైపొయ్యే రోజుల్లో చదువు కొనసాగించడం అది కూడా ఒక అమ్మాయికి ఎంత కష్టం. ఆమె విజయం వెనుక ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల సంకల్పబలం, ప్రొత్సాహం ఎంత గొప్పవో కదా. అన్ని కష్టాలకోర్చి ఆమె తన స్కూల్ విద్యను, సెకండరీ విద్యను పూర్తిచేశారు. వైద్య విద్యను అభ్యసించడానికి కావల్సిన ఫీజు డబ్బులు ఏర్పాటు చేసేందుకు ఆమె తల్లి తన మంగళసూత్రాన్ని అమ్మేశారట. వైద్య విద్యలో చేరడం ఆమె జీవితానికో పెద్ద మలుపనే చెప్పుకోవాలి. తల్లిదండ్రుల త్యాగనిరతి, తన భవిష్యత్తు కోసం వారు కనే కలలు ఆమెను మరింత బాధ్యతగా, స్పూర్తిమంతంగా తయారు చేశాయని చెప్పవచ్చు.
డాక్టర్ విజయలక్ష్మీ
వైద్య విద్యను అభ్యసించేందుకుగాను కర్ణాటక మెడికల్ కాలేజి (కేఎంసీ)లో విజయలక్ష్మి చేరారు. 1984 లో విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తర్వాత బళ్లారి మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. అప్పట్లో ఒక దళిత మహిళ సర్జన్ కావడమనేది ఒక అసాధారణ ఘనతగా చెప్పుకోవాలి. ఆమె తన ప్రస్థానాన్ని అక్కడితో ఆపలేదు ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్, బెంగుళూరులోని కిద్వాయి మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వంటి ప్రసిద్ధ క్యాన్సర్ సెంటర్లలో సర్జికల్ ఆంకాలజీ లో శిక్షణ పొందారు.
కిద్వాయిలో
డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే తన వృత్తి జీవితంలో ఎక్కువ భాగం బెంగుళూరుకు చెందిన ప్రతిష్టాత్మక కిద్వాయి మొమోరియల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఆంకాలజీలోనే గడిచింది, కిద్వాయిలో రెసిడెంట్ డాక్టర్ గా మొదలైన ఆమె వైద్య ప్రస్థానం 1994 లొ మొదటి మహిళా ప్రొఫెసర్ గా ఎదిగేస్థాయికి వచ్చింది. ఆ తర్వాత ఆంకాలజీ విభాగానికి అధిపతిగా కూడా పనిచేశారు. అనతికాలంలోనే డైరెక్టర్ ఇన్చార్జ్ గానూ వ్వవహరించారు.
అంకితభావం ఆమె అభిమతం
స్త్రీలలో కనిపించే క్యాన్సర్లలో అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. వేలాది మంది పేద మహిళలకు ఆమె మెరుగైన వైద్యం అందించారు. తన పరిధిలో ఉన్నంత వరకు ఆమె చాలా మంది పెదలకు ఉచిత వైద్యం అందించారు. అత్యంత తక్కువ ఖర్చులో క్యాన్సర్ చికిత్స అందించాలనేదే ఆమె లక్ష్యంగా పనిచేశారు. తనకు వైద్యం డబ్బు సంపాధించే మార్గం కాదని అదొక సేవగా భావించానని ఆమె చెబుతారు. కర్ణాటకలో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేదుకు ఆమె విశేష కృష్టి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనా రాహిత్యం వల్ల ఎంతో మంది క్యాన్సర్ ను గుర్తించడంలో జాప్యం జరిగి ప్రాణాపాయంలో పడటాన్ని ఆమె జీర్జీంచుకోలేక పోయేవారు. అందుకే క్యాన్సర్ లక్షణాలు, చికిత్స గురించిన అవగాహనా కార్యక్రమాలు రూపొందించి అమలు పరిచారు. తనకు వ్యక్తిగత జీవితం ఉంటే వృత్తికి న్యాయం చెయ్యలనేమో అనే అనుమానంతో ఆమె అవివాహితగానే ఉండిపోయారు.
పురస్కారలకే గౌరవం
వైద్యరంగంలో ఆమె చేసిన విశేష కృషికి గానూ రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలోనూ మంచి గుర్తింపు లభించింది. 2025 లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్ర తో సత్కరించింది. 2004 లో కర్ణాటక రష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారం కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు అందించింది. రాష్ట్ర రతన్ అవార్డు, మహిళా శిరోమణి అవార్డు, ఆసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ వంటి అనేకానేక గౌరవాలు ఆమెకు లభించాయి. 70 సంవత్సరాల వయసులోనూ ఆమె ఇప్పటికీ కర్ణాటక లోని క్యాన్సర్ సొసైటీ ఉపాధ్యక్షురాలిగా తన సేవలు అందిస్తూనే ఉన్నారు. నిర్విరామంగా క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
పేదరికం, సామాజిక వివక్షల వంటి ఎన్ని అణచివేతలు, అడ్డంకులు ఉన్నప్పటికీ పట్టుదల, సంకల్ప బలం ముందు నిలవలేవని చెప్పే కథ విజయలక్ష్మీ దేశ్మానే జీవితం. ఉన్నతంగా ఎదగాలనే ప్రగాఢ కాంక్ష ముందు ఏ వివక్ష నిలువలేదని నిరూపించి చూపించిన ధీర డాక్టర్ విజయలక్ష్మీ దేశ్మానే. ఆమె కేవలం డాక్టర్ గా రోగులకు సేవ చెయ్యడమొక్కటే కాదు వేలాది మంది వెనుకబడిన సమాజాలకు చెందిన యువతులకు ఆదర్శం.
