Let's talk: editor@tmv.in
పేటెంట్‌ ఔషధాల దిగుమతిపై అమెరికా 100 శాతం టారిఫ్‌లు

పేటెంట్‌ ఔషధాల దిగుమతిపై అమెరికా 100 శాతం టారిఫ్‌లు

Shaik Mohammad Shaffee
4 ఏప్రిల్, 2026

‘లిబరేషన్‌ డే’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల నియంత్రణ ఒప్పందాలకు అంగీకరించని విదేశీ ఫార్మా కంపెనీలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను (టారిఫ్‌లు) విధిస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. స్వదేశీ తయారీని ప్రోత్సహించడం, జాతీయ భద్రతను కాపాడటం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే అమెరికాలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే కంపెనీలకు మాత్రం కొంత ఉపశమనం లభించనుంది.

రాయితీలు ఎవరికంటే?

ప్రభుత్వంతో ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ ధరల ఒప్పందం కుదుర్చుకుని, అమెరికాలోనే ఔషధ తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలపై ఎటువంటి టారిఫ్‌లు ఉండవు. ఒకవేళ ఒప్పందం కుదుర్చుకోకుండా కేవలం అమెరికాలో ప్లాంట్లు నిర్మిస్తుంటే.. తొలుత 20 శాతం సుంకం విధిస్తారు. రాబోయే నాలుగేళ్లలో దీనిని 100 శాతానికి పెంచుతారు. పెద్ద ఫార్మా కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 120 రోజుల సమయం, చిన్న కంపెనీలకు 180 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పటికే ఫైజర్, ఎలీ లిల్లీ వంటి 17 ప్రధాన కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపగా, 13 కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

దేశాల వారీగా సుంకాలు

కేవలం కంపెనీలకే కాకుండా, కొన్ని మిత్ర దేశాలకు కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక టారిఫ్ రేట్లను ఖరారు చేసింది. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ల నుంచి వచ్చే పేటెంట్ మందులపై 15 శాతం సుంకం వర్తించనుంది. ఇక బ్రిటన్‌కు 10 శాతం సుంకం విధించగా, భవిష్యత్తులో దీనిని సున్నాకు తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో తయారీ పెరిగి ధరలు తగ్గుతాయని ట్రంప్ వాదిస్తుండగా, విదేశాల నుంచి వచ్చే నాణ్యమైన మందుల ధరలు పెరుగుతాయని ఫార్మా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌పై పడే ప్రభావం

ఈ నిర్ణయం వల్ల భారత ఫార్మా రంగానికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికాకు పేటెంట్‌ ఔషధాలు, ముడి పదార్థాలను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై ఈ 100 శాతం టారిఫ్ భారం పడనుంది. దీనివల్ల భారతదేశ ఔషధాల ధరలు పెరిగి, అక్కడ పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉంది. అయితే ట్రంప్ సూచించినట్లుగా అమెరికాలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే లేదా అక్కడి ప్రభుత్వంతో ధరల ఒప్పందాలు కుదుర్చుకునే దిగ్గజ భారతీయ కంపెనీలకు ఈ నిబంధనల నుంచి వెసులుబాటు లభించవచ్చు. ఇప్పటికే అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన భారత ఫార్మా సంస్థలు ఇప్పుడు అక్కడ ప్లాంట్లను నిర్మించడమా లేక భారీ పన్నులు చెల్లించడమా అనే సంకట స్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు.

నేపథ్యం..

ట్రంప్ తన రెండో విడత పదవీ కాలం ప్రారంభమైనప్పటి నుంచి దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ వస్తున్నారు. గతేడాది ఇదే రోజున 'లిబరేషన్ డే' పేరుతో ఆయన ప్రపంచ దేశాలపై భారీ పన్నులు విధించగా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అయితే గత ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ కింద విధించిన ఆ టారిఫ్‌లను కొట్టివేసింది. దీంతో ట్రంప్ ఇప్పుడు 1962 నాటి ‘ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్’లోని సెక్షన్ 232ను ఆయుధంగా చేసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న సాకుతో ఈ సెక్షన్ ద్వారా కొత్తగా రంగాల వారీగా పన్నులు బాదుతున్నారు.

మెటల్‌ టారిఫ్‌ల్లోనూ భారీ మార్పులు

కేవలం ఔషధాలే కాకుండా స్టీల్‌, అల్యూమినియం, రాగి దిగుమతులపై కూడా ట్రంప్ కీలక మార్పులు చేశారు. వచ్చే సోమవారం నుంచి వీటిపై 50 శాతం సుంకం అమలవుతుంది. అయితే పన్నును తప్పించుకోకుండా ఉండేందుకు, వస్తువు మొత్తం విలువపై పన్ను లెక్కించేలా నిబంధనలు మార్చారు. ఒక వస్తువులో లోహం 15 శాతం కంటే తక్కువ ఉంటే (ఉదాహరణకు పెర్ఫ్యూమ్ సీసా మూత) దేశాల వారీగా సాధారణ పన్నులు ఉంటాయి. కానీ వాషింగ్ మెషీన్ల వంటి వాటిలో లోహం శాతం 15 కన్నా ఎక్కువ ఉంటే, ఆ వస్తువు మొత్తం ధరపై 25 శాతం సుంకం విధిస్తారు.

పెరుగుతున్న ధరల భారం

అమెరికా సంపదను విదేశీయులు దోచుకుంటున్నారని, వాణిజ్య లోటును తగ్గించేందుకే ఈ పన్నులు అని ట్రంప్ సమర్థించుకుంటున్నారు. కానీ దీనివల్ల సరఫరా గొలుసు దెబ్బతినడమే కాకుండా, సామాన్యులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పెరుగుతోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 20కి పైగా అమెరికా రాష్ట్రాలు ట్రంప్ విధిస్తున్న ఈ వరుస టారిఫ్‌లను సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించాయి. తాజా ఫార్మా పన్నులతో విదేశీ మందులపై ఆధారపడే రోగులకు చికిత్స మరింత భారమయ్యే అవకాశం కనిపిస్తోంది.

పేటెంట్‌ ఔషధాల దిగుమతిపై అమెరికా 100 శాతం టారిఫ్‌లు - Tholi Paluku