
పెషావర్‌లో శాశ్వతంగా అమెరికా కాన్సులేట్ మూసివేత
దశాబ్దాల చరిత్ర కలిగిన పాకిస్థాన్‌లోని పెషావర్ అమెరికా కాన్సులేట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండి, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ దౌత్య కార్యాలయాన్ని ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్‌కు అధికారికంగా నోటీసు ఇచ్చింది. 2001లో ఆఫ్ఘనిస్థాన్‌పై దండయాత్ర సమయంలో అమెరికాకు ఇది ప్రధాన కార్యకలాపాల కేంద్రంగా, లాజిస్టిక్స్ పాయింట్‌గా సేవలందించింది.
ఖర్చు తగ్గింపులో భాగంగానే ఈ నిర్ణయం
ఈ కాన్సులేట్ మూసివేత ద్వారా ఏడాదికి దాదాపు 7.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.69 కోట్లు) నిధులు ఆదా అవుతాయని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది కాలంగా చేపడుతున్న ఫెడరల్ ఏజెన్సీల కుదింపు (డౌన్‌సైజింగ్) ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో వేలాది మంది దౌత్యవేత్తలను తొలగించడంతో పాటు, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విదేశాల్లో పూర్తిగా మూతపడుతున్న మొదటి దౌత్య కార్యాలయం ఇదే కావడం గమనార్హం
యుద్ధం కారణం కాదు
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీ, పెషావర్ వంటి నగరాల్లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నగరాల్లో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, పెషావర్ కాన్సులేట్ శాశ్వత మూసివేతకు ఈ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మూసివేత ప్రక్రియ కోసం అమెరికా దాదాపు 3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఇందులో సగానికి పైగా నిధులు కార్యాలయాలుగా ఉన్న సాయుధ ట్రైలర్ల తరలింపునకే వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను టెలికమ్యూనికేషన్ పరికరాలు, మోటార్ వెహికల్స్, ఫర్నిచర్‌ను ఇస్లామాబాద్‌లోని రాయబార కార్యాలయానికి తరలించడానికి ఉపయోగిస్తారు.
ప్రత్యామ్నాయ మార్గాలు
ప్రస్తుతం ఈ కాన్సులేట్‌లో 18 మంది అమెరికన్ దౌత్యవేత్తలు, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు. కార్యాలయం మూతపడినప్పటికీ, పాకిస్థాన్‌లో అమెరికా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. పెషావర్ నుంచి సుమారు 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం ఇకపై పెషావర్ పరిధిలోని సేవలను కూడా పర్యవేక్షిస్తుంది. అమెరికా పౌరులకు అవసరమైన సాయం, వీసా సేవలు, విదేశీ సాయం కార్యక్రమాల పర్యవేక్షణ అంతా ఇకపై ఇస్లామాబాద్ నుంచే కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
